కాంచనగంగ రైలు ప్రమాదంలో 10కి చేరిన మృతుల సంఖ్య

సిలిగురి : పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌ జిల్లాలో సోమవారం జరిగిన కాంచనగంగ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరుకుంది. ఈ విషయాన్ని అధికారులు మంగళవారం వెల్లడించారు. ప్రమాద స్థలంలోనే మృతి చెందిన ఎనిమిది మంది మృతదేహాలను సిలిగురిలోని నార్త్‌ బెంగాల్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పటల్‌ (ఎన్‌బిఎంసిహెచ్‌)కు తరలించారు. మరో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. వీరిలో ఒకరు ఆరేళ్ల బాలిక అని ఎన్‌బిఎంసిహెచ్‌ డీన్‌ డాక్టర్‌ సందీప్‌ సేన్‌గుప్తా తెలిపారు. ఆరేళ్ల బాలికను తీవ్రగాయాలతో ఆసుపత్రికి తీసుకొచ్చారని, చికిత్స పొందుతూ మరణించిందని చెప్పారు. మొత్తంగా ఈ రైలు ప్రమాదానికి సంబంధించి 37 మంది గాయాలతో ఆసుపత్రిలో చేరారని, ఇందులో ఇద్దరు ప్రాథమిక చికిత్స అనంతరం ఇళ్లకు వెళ్లిపోయారని తెలిపారు. చికిత్స పొందుతున్న మిగిలిన అందర్నీ మంచి ఆరోగ్యంతో ఇంటికి పంపించడమే తన లక్ష్యమని అన్నారు. న్యూ జల్పాయిగురి స్టేషన్‌కు 30 కిమీ దూరంలోని రంగపాణి వద్ద సోమవారం ఉదయం కాంచనగంగా ఎక్స్‌ప్రెస్‌ రైలును గూడ్స్‌ రైలు ఢకొీట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ప్రభావానికి గురికాని బోగీలతో కోల్‌కతాలోని సీల్దా స్టేషన్‌కు ఈ రైలు మంగళవారం ఉదయం చేరుకుంది. తెల్లవారుజామున 3:16 గంటలకు దాదాపు 850 మంది ప్రయాణికులతో రైలు చేరుకుందని అధికారులు తెలిపారు. ప్రయాణికులకు వైద్య సదుపాయాలు, ఆహారం, నీరు అందించినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులను ఇళ్లకు చేర్చేందుకు 16 బస్సులు, 60 కార్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

➡️