ఆయిల్‌పామ్‌ వైపు మొగ్గు !

Mar 4,2024 10:50
  • ఏడాదిలో 23 వేల ఎకరాల్లో పెరిగిన సాగు
  • ధర నిలకడలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అండగా నిలబడాలంటున్న రైతులు

ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి : ఆయిల్‌పామ్‌ సాగు పట్ల ఏలూరు జిల్లా రైతులు మొగ్గుచూపుతున్నారు. మామిడి, జీడిమామిడి తోటలను తొలగించి ఈ మొక్కలు నాటుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 23 వేల ఎకరాల్లో దీని సాగు పెరిగింది. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధర విషయంలో సరైన ప్రోత్సాహం ఇవ్వడం లేదన్న అసంతృప్తి రైతుల్లో ఉంది. ప్రభుత్వాలు మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తే ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం, దిగుబడి పెరిగే అవకాశం ఉందని వారు చెప్తున్నారు. జిల్లాలోని మెట్టప్రాంతం ఆయిల్‌పామ్‌ సాగుకు పేరేన్నికగన్నది. 27 మండలాలు ఉండగా, 22 మండలాల్లో 1.30 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగవుతోంది. మొక్కజొన్న, అరటి, మామిడి వంటి పంటలు సాగు చేస్తున్న రైతులు ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. ఆయిల్‌పామ్‌ సాగుతో పెద్దగా ఇబ్బందులు లేకపోవడం, ఈ తోటలకు కౌలు ఎక్కువగా వస్తుండడంతో భూ యజమానులు ఇటువైపు మళ్లుతున్నారు. ఆయిల్‌పామ్‌ తోట వేసిన మూడేళ్లకు దిగుబడి ప్రారంభం అవుతుంది. ఎకరాకు 143 మొక్కల వరకూ నాటుతారు. దిగుబడి వచ్చే వరకూ అంతర పంటలుగా మొక్కజొన్న, కూరగాయలు, కోకో వంటి పంటలను సాగు చేస్తున్నారు. నూనె శాతం ఆధారంగా ఆయిల్‌పామ్‌ ధర నిర్ణయిస్తారు. జిల్లాలోని పెదవేగిలో ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ ఉంది. దీన్ని నిర్మించి చాలా ఏళ్లు కావడంతో నూనె శాతం నిర్థారణలో తేడాలు వస్తున్నాయి. దీంతో, తెలంగాణ జిల్లా అశ్వారావుపేట ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీలో నూనె శాతం నిర్ధారణ ఆధారంగా ధర నిర్ణయిస్తున్నారు. కొత్త ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ నిర్మించాలని పదేళ్లుగా రైతులు కోరుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. పెదవేగి మండలం రామశింగారంలో 50 ఎకరాల్లో ఫ్యాక్టరీ నిర్మాణానికి స్థల సేకరణ జరిగినా నిర్మాణం ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే తమకు మేలు కలుగుతుందని రైతులు చెప్తున్నారు. దీని నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని కోరుతున్నారు.

నిలకడలేని ధరతో తీవ్ర ఇబ్బందులు

               ధరలో నిలకడ లేకపోవడం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. గడిచిన ఏడాదిలో టన్ను ఆయిల్‌పామ్‌ ధర రూ.23 వేల వరకూ పలికింది. ఈ ఏడాది టన్ను రూ.12,410కు పడిపోయింది. కొన్నిసార్లు అంతకన్నా తక్కువ పలికిన సందర్భాలూ ఉన్నాయి. ఎకరాకు ఎనిమిది టన్నుల వరకూ దిగుబడి వస్తుంది. దీంతో, ఎకరాకు దాదాపు రూ.లక్ష వరకూ ఆదాయం సమకూరుతుంది. ఎకరాకు రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకూ పెట్టుబడి అవుతుంది. భూ యజమాని సాగు చేస్తే నష్టాలు లేకుండా బయటపడుతున్నాడు. కౌలురైతులు కౌలు కింద ఎకరాకు రూ.70 వేలు వరకూ చెల్లించాల్సి రావడంతో నష్టపోతున్నారు. ధర పెరుగుతుందన్న ఆశతో రైతులు ఆయిల్‌పామ్‌ సాగువైపు మక్కువ చూపుతున్నారు. ధర విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఏమాత్రమూ అండగా నిలవడం లేదు. మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తే పామాయిల్‌ సాగు ఇంకా వృద్ధి చెందే అవకాశం ఉంది.

కొత్తగా తోటలు వేసే రైతులకు సబ్సిడీ

               ఒక్క ఏడాదిలో 23 వేల ఎకరాల్లో కొత్తగా ఆయిల్‌పామ్‌ సాగు చేపట్టడంతో జిల్లా మొదటి స్థానంలో ఉంది. కొత్తగా తోటలు వేసే రైతులకు మొక్కకు రూ.193 సబ్సిడీని ప్రభుత్వం ఇస్తోంది. నాలుగేళ్ల వరకూ ఎరువులు ఇతర ఖర్చుల కింద హెక్టారుకు రూ.5,250, అంతర పంటలకు అదే స్థాయిలో సబ్సిడీ అందిస్తోంది. దేశంలో ఆయిల్‌పామ్‌ పంటకు భవిష్యత్తులోనూ మంచి ఆదరణ ఉండనుండడం, మార్కెట్‌ గ్యారెంటీ, నిత్య ఆదాయం, కౌలు బాగా వస్తుండడంతో రైతులు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. పెదవేగి మండలం రామశింగవరంలో ఫ్యాక్టరీ నిర్మాణానికి స్థల సేకరణ జరిగింది. నిర్మాణం చేయాల్సి ఉంది.            – ఎస్‌.రామ్మోహన్‌, ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్‌, ఏలూరు జిల్లా

➡️