తేలని సీట్ల పంచాయితీ

Feb 11,2024 10:05 #panchayats, #seats
  • గుంభనంగా టిడిపి, జనసేన నేతలు
  • త్వరలో మైనార్టీలతో టిడిపి ప్రత్యేక సమావేశం
  • ఎన్‌డిఎలో టిడిపి చేరిక లాంఛనమే

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సాధారణ ఎన్నికల సమయం గడువు దగ్గర పడుతున్నప్పటికీ టిడిపి, జనసేన సీట్ల సర్ధుబాటు ఒక కొలిక్కి రాకపోవడంతో ఆయా పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ మధ్య ఇప్పటికే సీట్ల సర్ధుబాటుపై రెండు ధఫాలు చర్చలు జరిగినప్పటికీ ఫైనల్‌గా ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారనే సంఖ్యపై ఇంకా ఏకాభిప్రాయం కుదిరినట్లు లేదన్న అభిప్రాయం ఇరుపార్టీల శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. దీంతో తుది ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు టిడిపి అధ్యక్షులు చంద్రబాబు, కేంద్ర హోమ్‌మంత్రి అమిత్‌షా, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాతో ఢిల్లీలో భేటీ కావడంతో టిడిపి ఎన్‌డిఎలో చేరిక దాదాపు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్‌డిఎ కూటమిలో చేరితే ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంక్‌ దూరం అవుతుందన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. దీంతో త్వరలో మైనార్టీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. శనివారం జరిగిన ఎకనమిక్‌ టైమ్స్‌ సమ్మిట్‌లో త్వరలో ఎపిలో పొత్తులపై నిర్ణయాలు ఉంటాయని అమిత్‌షా చెప్పడం గమనార్హం, ఎన్‌డిఎలోకి కొత్త మిత్రులు వస్తున్నారని ఆయన అన్నారు. ‘రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టి కొందరు గతంలో ఎన్‌డిఎ నుండి బయటకు వెళ్లి ఉండవచ్చు. దానిని మేం పట్టించుకోం.’ అని కూడా ఆయన చెప్పారు.

దీంతో గతంలో ఎన్‌డిఎ కూటమిలో భాగస్వామిగా ఉన్న టిడిపితో జత కట్టడం దాదాపు ఖాయమనే భావిస్తున్నారు. బిజెపికి 4 ఎంపి, 7 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇది ఇలా ఉంటే జనసేనకు 3 ఎంపి సీట్లు, 28 శాసనసభ సీట్లు ఇచ్చేందుకు కూడా టిడిపి సిద్ధమైనట్లు తెలిసింది. జనసేన మరికొన్ని సీట్లు కావాలని అడుగుతున్న నేపథ్యంలో ఎలా సర్ధుబాటు చేయాలనే అంశంపై టిడిపి అధిష్టానం మల్లగుల్లాలు పడుతున్నట్లు చర్చ నడుస్తోంది. సీట్ల సర్ధుబాటు ప్రక్రియ పూర్తి కాకపోవడం, అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో రెండు పార్టీల్లోని ద్వితీయశ్రేణి నాయకులు పొత్తులపై కామెంట్లు చేస్తుండటం ఆయా పార్టీలకు తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో శనివారం జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ పొత్తులకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేశారు. జనహితానికి, రాష్ట్ర సమగ్రాభివృద్ధికే జనసేన ప్రాధాన్యం ఇస్తోందని, విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పొత్తు పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యలు చేయవద్దని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. కాగా, బిజెపితో పాటు, ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే పార్టీలకు ఓటు వేయవద్దని వామపక్షాలు ఇప్పటికే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

➡️