పరాయి పంచన కేంద్రీయ విద్యాసంస్థలు

  •  పూర్తి కాని అనంతపురంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయ భవనాలు
     నేటికీ టెండర్ల దశలోనే విజయనగరంలోని గిరిజన విశ్వవిద్యాలయం
    వసతుల కొరతతో విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు

ప్రజాశక్తి- అనంతపురం, విజయనగరం ప్రతినిధులు : విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన అత్యున్నత విద్యా సంస్థలు నేటికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. కొన్ని అరకొర సౌకర్యాల మధ్య నడుస్తున్నాయి. అనంతపురంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం భవనాలు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. విజయనగరం జిల్లాలోని గిరిజన విశ్వవిద్యాలయం టెండర్ల స్థాయిలోనే ఉంది. యువతలో నైపుణ్యాన్ని వెలికితీసి, మంచి భవిష్యత్తు అందించేందుకు రాష్ట్రానికి 11 అత్యున్నత విద్యా సంస్థలను ఇచ్చామని పల్నాడు జిల్లా బొప్పూరులో ఈ నెల 17న బిజెపి, టిడిపి, జనసేన ఆధ్వర్యాన జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో మోడీ గొప్పగా చెప్పుకొచ్చారు. అయితే, పదేళ్లు కావస్తున్నా వీటిలో కొన్ని పరాయి పంచనే కొనసాగుతున్నాయి. అనంతపురంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం భవనాలు నేటికీ పూర్తి కాలేదు. నిధుల మంజూరులో జాప్యమే ఇందుకు కారణం. జెఎన్‌టియులోని ఇంక్యుబేషన్‌ భవనంలో 2018లో తాత్కాలిక భవనంలో విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. విద్యార్థుల సంఖ్య పెరగడంతో హాస్టల్‌, తరగతి గదుల కోసం పది కిలోమీటర్ల దూరంలోని ఒక ప్రయివేటు ఇంజనీరింగు కళాశాలలో ట్రాన్సిట్‌ క్యాంపస్‌ ఏర్పాటు చేశారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం భవనాలు పూర్తవలేదు. 2022-23లో రూ.12.82 కోట్లు, 2023-24లో రూ.112.08 కోట్లు మాత్రమే కేంద్రం కేటాయించింది. ఈ నిధులతోనే ఒక అడకమిక్‌ బ్లాక్‌, రెండు హాస్టల్‌ భవనాల నిర్మాణం జరుగుతోంది. తక్కినవి మలి దశలో చేపడతామని చెబుతున్నారు. ప్రస్తుతం అడకమిక్‌, రెండు హాస్టల్‌ భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. 2024-25 సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన ఇంటీరియమ్‌ బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు నాటికి బుక్కరాయసముద్రం మండలంలోని జంతలూరు వద్ద ఏర్పాటవుతున్న శాశ్వత భవనాల్లోకి మారుతామని విశ్వవిద్యాలయం పాలకవర్గం చెబుతున్న మాటలు కార్యరూపం దాల్చేలా కనిపించడం లేదు. విశ్వవిద్యాలయం పరిధిలో నాలుగు అండర్‌ గ్రాడ్యుయేషన్‌ (యుజి), తొమ్మిది పోస్టు గ్రాడ్యూయేషన్‌ (పిజి) కోర్సులు నడుస్తున్నాయి. 450 మంది విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ కోర్సులను రెట్టింపు చేయనున్నట్టు విశ్వవిద్యాలయం పాలకవర్గం ప్రకటించింది. అయితే, ఇప్పుడున్న కోర్సులకే తగినంత సిబ్బంది లేరు. పది మంది రెగ్యులర్‌ బోధనా సిబ్బంది, 28 మంది అతిథి అధ్యాపకులు ఉన్నారు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఫీజులు రెండు వేల రూపాయల లోపే ఉండగా, అనంతపురంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రూ.7 వేల నుంచి రూ.37 వేల వరకు ఉన్నాయి.
నాలుగైదు చోట్ల భూమి పరిశీలించి చివరికి విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలస మధుర గ్రామం చినమేడపల్లి, దత్తిరాజేరు మండలం మర్రివలసలో గిరిజన యూనివర్సిటీ కోసం భూమిని కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. 561.91 ఎకరాల భూముని సేకరించారు. నిర్మాణ పనులకు గత ఏడాది ఆగస్టు 25న ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ శంకుస్థాపన చేశారు. ఇప్పటికి ఏడు నెలలు దాటినా ఇంకా రూ.430 కోట్ల విలువైన పనులు టెండర్ల దశలో ఉన్నట్లు సమాచారం. విజయనగరం సమీపంలోని గాజులరేగ సమీపంలో పాత ఎయు క్యాంపస్‌లో ప్రస్తుతం తరగతులు నిర్వహిస్తున్నారు. కెమిస్ట్రీ, బోటనీ, బయోటెక్నాలజీ వంటి సైన్స్‌ కోర్సులతోపాటు బిజినెస్‌, టూరిజం వంటి మేనేజ్‌మెంట్‌ కోర్సులు, ఇంగ్లీషు, సోషల్‌ వర్క్‌, సోషియాలజీ, ట్రైబల్‌ స్టడీస్‌ వంటి 12 డిపార్ట్‌మెంట్లలో 14 రకాల కోర్సులు అందుబాటులో ఉన్నా ఒక్క డిపార్ట్‌మెంట్‌లోనూ పూర్తి స్థాయిలో అధ్యాపకులు లేరు. అరకొరగా ఉన్న వారిలో ఎక్కువమంది కాంట్రాక్టు, గెస్ట్‌ అధ్యాపకులే. మరికొన్ని కోర్సుల ఏర్పాటుకు అనుమతులు లభించినా వసతి సమస్య వల్ల ముందుకు సాగలేని పరిస్థితి. సరైన వసతులు లేవు. లేబొరేటరీలు కంటైనర్లలో నడుస్తున్నాయి. తగినంత లైబ్రరీ లేదు. దీంతో, కొన్ని సందర్భాల్లో రీసెర్చ్‌ల కోసం సెంచూరియన్‌ ప్రయివేట్‌ యూనివర్సిటీపై ఆధారపడాల్సి వస్తోంది. తరగతులు ఒకచోట, ప్రయోగాలు మరోచోట, పరిశోధనలు ఇంకోచోట జరుగుతుండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హాస్టల్‌ నిర్వహణకు నిధులు ఉన్నప్పటికీ అందుకు తగ్గ భవనం లేదు. దీంతో, సమీపంలోని సీతం కాలేజీ యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకుని అక్కడ కూడా 50 మంది విద్యార్థులకు మాత్రమే హాస్టల్‌ సదుపాయం కల్పించారు. మిగిలిన విద్యార్థులు ప్రయివేటు హాస్టళ్లలో ఉరంటున్నారు. ఈ నేపథ్యంలో గడిచిన రెండేళ్లగా అడ్మిషన్లు తగ్గిపోయాయి.

నిధులు కేటాయించాలి
అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటై ఏడు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలి. పూర్తి స్థాయిలో బోధనా సిబ్బందిని నియమించాలి.
– పరమేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అనంతపురం

➡️