రేషన్‌దారులకు రాగిపిండి

Mar 1,2024 11:26 #ration card

 కేజీ చొప్పున నేటి నుంచి పంపిణీ

ప్యాకెట్‌ ధర రూ.11గా నిర్ణయం

ప్రజాశక్తి-శ్రీకాకుళం ప్రతినిధి : తెల్లరేషన్‌ కార్డుదారులకు ఈ నెల నుంచి రాగిపిండి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత రాయలసీమలోని ఐదు జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లోని లబ్ధిదారులకు ఇవ్వనుంది. ఇప్పటివరకు రాయలసీమలోని ఐదు జిల్లాల్లో కార్డుదారునికి ఐదు కేజీల చొప్పున రాగులను పంపిణీ చేసింది. రాగులు నాసిరకంగా ఉండటం, వినియోగానికి పనికిరావంటూ లబ్ధిదారులు ఆసక్తి చూపకపోవడంతో వాటిని పిండిగా మార్చి ప్యాకెట్ల రూపంలో అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేజీ ప్యాకెట్‌ను రూ.11గా ధర నిర్ణయించింది. అందుకనుగుణంగా ఎనిమిది జిల్లాలకు సంబంధించి మొత్తం 2,390 మెట్రిక్‌ టన్నులను కేటాయించింది. రాగిపిండి వాడకంపై ప్రజల్లో స్పందన బట్టి రాయలసీమ, ఉత్తరాంధ్రలోని మిగిలిన జిల్లాలకు సరఫరా చేయనున్నట్లు సమాచారం. అన్ని జిల్లాలకు రాగి పిండి సరఫరా బాధ్యతలను విజయనగరం జిల్లాకు చెందిన విజయనగరం వీట్‌ ప్రాడక్ట్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌కు అప్పగించింది. రాగులను పిండిగా మార్చడం, వాటికి కేజీ ప్యాకెట్లు, 50 కేజీల బస్తాలుగా తయారు చేసి ఇవ్వడానికి మెట్రిక్‌ టన్నుకు రూ.10,500 ప్రభుత్వం చెల్లిస్తోంది.

కందిపప్పు లేనట్టే!

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌లో ఏ సరుకు ఏ నెల అందుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రేషన్‌ కార్డుదారులకు గతేడాది జూన్‌ నుంచి నవంబరు వరకు రాయితీ కందిపప్పు నిలిపివేశారు. గతేడాది డిసెంబరులో అరకొరగా సరఫరా చేయగా, సంక్రాంతి పండగ నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో మాత్రం పూర్తిస్థాయిలో కార్డుదారులకు పంపిణీ చేశారు. ఫిబ్రవరిలో అరకొరగా ఇచ్చారు. మార్చి నెలకు సంబంధించి ప్రభుత్వం కేటాయింపులు జరపలేదని తెలుస్తోంది.

➡️