తాయిలాలతో రెఢీ

Mar 29,2024 12:45 #politics
  • తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తిల్లో పందేరం
  • కుక్కర్లు, ఫ్యాన్లు, ముక్కుపుడకలు, పట్టు చీరలు
  • ఇప్పటికే పూర్తయిన 60 శాతం పంపకాలు
  • గోదాముల్లో 50 కోట్ల అధికార పార్టీ సరంజామా

ప్రజాశక్తి – తిరుపతి : తిరుపతి జిల్లాలో ఎన్నికల వేడి రాజుకుంటున్న వేళ … ఓటర్లను ప్రలోభాలతో ముంచెత్తేందుకు అభ్యర్థులు రెడీ అయిపోయారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఇప్పటికే కుక్కర్లు ,గోడ గడియారాలు, దుస్తులను పెద్ద ఎత్తున పంపిణీ చేసిన అధికార పార్టీ నేతలు తాజాగా ఫ్యాన్లు, రిస్ట్‌ వాచీలు, స్పీకర్లు పంపిణీ చేసేందుకు సంసిద్ధులయ్యారు. ఇక తామేమి తక్కువ కాదంటూ ప్రతిపక్ష అభ్యర్థులూ రంగంలోకి దిగారు. చీరలు, ముక్కు పుడకలు ఇచ్చేందుకు సిద్ధమని కార్యకర్తలు ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే బూత్‌ లెవల్‌ ముఖ్య నాయకుల చేతుల్లో కొత్త ఆండ్రాయిడ్‌ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. ఈ తరుణంలోనే చంద్రగిరి, శ్రీ కాళహస్తి గోదాముల్లో దాదాపు రూ. 50 కోట్ల విలువచేసే అధికార పార్టీ సరంజామా పట్టుబడటం తీవ్ర దుమారం లేపుతోంది.

50 కోట్ల విలువ చేసే బహుమతులు సీజ్‌ ?
చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని పలు గోదాముల్లో అధికార పార్టీకి చెందిన ఇద్దరి ఎమ్మెల్యేల ఎన్నికల తాయిలాలు ఉన్నట్లు గుర్తించిన విపక్ష పార్టీ కార్యకర్తలు అధికారులకి సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి ప్రతిపక్ష నేతలు తమ కార్యకర్తలతో కలిసి ఆయా గోడౌన్‌ల వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో రెవెన్యూ పోలీస్‌ అధికారులు పాత ఎయిర్‌పోర్టు సమీపంలోని గోదాములు తనిఖీ చేయగా దాదాపు రూ. 50 కోట్ల విలువ చేసే బహుమతులు బహిర్గతం కావడం గమనార్హం.
గోడౌన్‌లలో భారీ మొత్తంలో తాయిలాలు దొరికినప్పుడు ఎన్నికల అధికారులు ఏమయ్యారని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. గోడౌన్‌లోలో ఎన్నికల బహుమతులను భద్రపరచడం ఎన్నికల నియమావళికి విరుద్దం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. వీటిపై వెంటనే ఎస్‌పి, కలెక్టర్‌ దృష్టి సారించాలని, కఠిన చర్యలు తీసుకోవాలని టిడిపి నేతలు కోరుతున్నా జిల్లా కలెక్టర్‌, ఎస్‌పిలు ఎవ్వరూ అధికారికంగా స్పందించక పోవడం గమనార్హం.

తాయిలాలతో ప్రతిపక్ష అభ్యర్థులూ సిద్ధం !
ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని నిర్ణయించుకున్న ప్రతిపక్ష అభ్యర్థులు సైతం అధికార పార్టీ నేతలకు దీటుగా తాయిలాలు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే పలువురు ముఖ్య కార్యకర్తలకు విలువైన బహుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున డబ్బు, పట్టు చీరలు, ముక్కు పుడకలు పంపిణీ చేసేందుకు తమ తమ శ్రేణులను సిద్ధం చేసుకోవడం గమనార్హం.

➡️