రూ.7.30 లక్షల కోట్ల సంపద ఆవిరి

May 10,2024 07:57 #sensex
  • సెన్సెక్స్‌ 1060 పాయింట్లు పతనం

ముంబయి : దలాల్‌ స్ట్రీట్‌ను ఎన్నికల భయం పట్టుకుంది. ఫలితాలు బిజెపికి ఊహించిన విధంగా అనుకూలంగా ఉండవన్న అనుమానాలు మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో గురువారం ఒక్కరోజూ 7.30 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. బిఎస్‌ఇ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ కాపిటలైజేషన్‌ రూ.400 లక్షల కోట్ల నుంచి రూ.393.73 లక్షల కోట్లకు పడిపోయింది. అన్ని మార్కెట్‌ సూచీలు రోజంతా నష్టాల వైపే పరుగులు తీశాయి. లోక్‌సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్లను సాధించడమే లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నినాదంతోనే బిజెపి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. పదిసంవత్సరాల పదవీ కాలంలో నరేంద్రమోడీ పెద్దఎత్తున కార్పొరేట్‌ అనుకూల విధానాలు అమలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మోడీ అండ్‌కో ప్రచారానికి కార్పొరేట్‌ లోకం సానుకూలంగా స్పందించింది. కార్పొరేట్‌ మీడియాలో ఇప్పటికీ ఆ ప్రచారమే హోరెత్తుతోంది. అయితే, ఒక్కో విడత పోలింగ్‌ ప్రక్రియ ముగిసే కొద్దీ మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి అంత సీన్‌ లేదన్న విషయం స్పష్టమౌతూ వచ్చింది. ఇప్పటివరకు మూడు విడతలుగా జరిగిన పోలింగ్‌ ప్రక్రియలో బిజెపికి ఎదురుగాలి వీచిందన్నది పరిశీలకుల అంచనా! దీనికి తగ్గట్టుగానే ప్రధానమంత్రి ప్రచారశైలి కూడా మారుతూ వచ్చింది. సోమవారం జరగనున్న పోలింగ్‌లోనూ బిజెపికి ఆశించినన్ని సీట్లు దక్కడం కష్టమని ఇప్పటికే తేలిపోయింది ఈ ప్రభావం దలాల్‌ స్ట్రీట్‌పై పడింది. సెన్సెక్స్‌-30లో టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇన్ఫోసిస్‌, హెచ్‌సిఎల్‌ షేర్లు మినహా మిగిలిన అన్ని స్టాక్స్‌ ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌, ఎల్‌అండ్‌టి, రిలయన్స్‌ ఇండిస్టీస్‌, ఐటిసి, ఏషియన్‌ పెయింట్స్‌, బిపిసిఎల్‌, కోల్‌ ఇండియా, ఒఎన్‌జిసి, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ తదితర షేర్లు భారీ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీలో ఆటో మినహా అన్ని రంగాలు క్షీణించాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ షేర్లు 3.2 శాతం నష ్టపోయాయి. మెటల్‌ 2.9 శాతం, ఎఫ్‌ఎంసిజి 2.5 శాతం దిగజారాయి. ఫార్మా, రియాల్టీ సూచీలు 2శాతం చొప్పున పతనమయ్యాయి. దీంతో బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 1062 పాయింట్లు పసతనమైంది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 345 పాయింట్లు కోల్పోయింది. బిజెపి ఊహించిన విధంగా ఫలితాలు సాధించలేదన్న భయమే మార్కెట్‌ అస్థిరతకు కారణమని ఐఎఫ్‌ఎ గ్లోబల్‌ వ్యవస్థాపకుడు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అభిషేక్‌ గోయెంకా రాయిటర్స్‌తో తెలిపారు.

➡️