హెలికాప్టర్‌ ప్రమాదంలో రైసీ మృతి – ఇజ్రాయిల్‌ పాత్రపై అనుమానాలు!

  • ధ్రువీకరించిన ఇరాన్‌
  •  ప్రపంచ నేతల సంతాపం
  •  తాత్కాలిక అధ్యక్షుడిగా మొక్బర్‌

టెహ్రాన్‌: ఆదివారం నాటి హెలికాప్టర్‌ ప్రమాదంలో ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించారు. హెలికాప్టర్‌లో ఆయనతోబాటు వెళ్లిన విదేశాంగ మంత్రి హుస్సేన్‌ అమీర్‌ అబ్దుల్లా హియాన్‌, తూర్పు అజర్‌బైజాన్‌ ప్రొవిన్స్‌ గవర్నరు, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ విషాదకర ఘటనలో చనిపోయినట్లు ప్రభుత్వ మీడియా సోమవారం ధ్రువీకరించింది. అజర్‌బైజాన్‌ సరిహద్దుల్లోని వర్జాఘన్‌ పర్వత శ్రేణుల్లో కూలి దగ్డమైన హెలికాప్టర్‌ శకలాలకు సంబంధించిన దృశ్యాలను ఇరాన్‌ టివి ప్రసారం చేసింది. హెలికాప్టర్‌లో మొత్తం తొమ్మిది మంది ఉండగా ఒక్కరు కూడా జీవించి లేరని తెలిపింది. ఇరాన్‌ రాజ్యాంగం ప్రకారం చనిపోయిన అధ్యక్షుడు రైసీ స్థానంలో తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రథమ ఉపాధ్యక్షుడు మహ్మద్‌ మొక్బర్‌ (68)ను ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఆయతుల్లా ఖమేనీ సోమవారం నియమించారు. తాత్కాలిక అధ్యక్షుడు, పార్లమెంటు స్పీకర్‌, సుప్రీం కోర్టు చీఫ్‌లతో కూడిన త్రిసభ్య మండలి 50 రోజుల్లోగా అధ్యక్ష పదవికి తిరిగి తాజాగా ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. తాత్కాలిక విదేశాంగ మంత్రిగా ఇరాన్‌ అణు చర్చల సంథానకర్త అలీ బగ్చేరిని నియమించారు. విదేశాంగ విధానం, అణు బటన్‌ నియంత్రణ వంటి కీలకమైన అధికారాలు సుప్రీం లీడర్‌ అయతుల్లా ఖమేని వద్దే ఉంటాయి. ఆయనకు కాబోయే వారసుడిగా ప్రచారంలో ఉన్న రైసీ దుర్మరణం పాలవడంతో, రాజ్యాంగ బద్ధంగానే ఉపాధ్యక్షుడు మొక్బర్‌ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షుని కాన్వారులో భాగంగా వెళ్లిన రెండు హెలికాప్టర్లు సురక్షితంగా గమ్యస్థానానికి చేరు కున్నట్లు ఇరానియన్‌ మీడియా తెలిపింది. ఇటీవల ఇజ్రాయిల్‌, ఇరాన్‌ మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో రైసీ హెలికాప్టర్‌ కూలిపోవడం వెనక ఇజ్రాయిల్‌ హస్తం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో తమకెలాంటి ప్రమేయం లేదని ఇజ్రాయిల్‌ ప్రతినిధి ఒకరు చెప్పారు.  రైసీ మృతికి సంతాప సూచకంగా ఇరాన్‌ జాతీయ పతాకాన్ని అవనతం చేసి, ఐదు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు.

ప్రపంచ నేతల సంతాపం
హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన ఇబ్రహీం రైసీకి సంతాపం తెలియజేస్తూ భారత్‌, పాకిస్తాన్‌, రష్యా, చైనా, ఈజిప్ట్‌, ఫ్రాన్స్‌, టర్కీ, ఇరాక్‌, సిరియా, లెబనాన్‌, కతార్‌, మలేసియా, దక్షిణాఫ్రికా సహా పలుదేశాల నేతలు పలువురు సందేశాలు పంపారు. రైసి ఆకస్మిక మృతి తమను కలచివేసిందని మోడీ వ్యాఖ్యానించారు. ఇదొక విషాదకరమైన సంఘటన అని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ వ్యాఖ్యానించారు. రష్యాకు నిజమైన మిత్రుడు రైసి అని పుతిన్‌ వ్యాఖ్యానించారు. ఈ విమాన ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేసే క్రమంలో తాము సాయపడేందుకు సిద్ధంగా వున్నామని రష్యా ప్రకటించింది.
ఇరాన్‌ ప్రజలకు తమ సంఘీభావం వుంటుందని ఇరాక్‌ ప్రధాని షియా అల్‌ సుదాని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యురోపియన్‌ యూనియన్‌ విదేశాంగ విధాన చీఫ్‌ జోసెఫ్‌ బోరెల్‌ కూడా తమ సంతాపాన్ని తెలియజేశారు.

సామ్రాజ్యవాద వ్యతిరేక పోరులో కీలకపాత్ర పోషించిన రైసీ
సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడే శక్తులను ఐక్యపరిచే కీలక నేతల్లో రైసీ ఒకరు. ఇరాన్‌ అణు కార్యక్రమంలోను, మధ్య, పశ్చిమాసియా అంతర్గత వ్యవహరాల్లో అమెరికా జోక్యాన్ని గట్టిగా వ్యతిరేకిస్తూ వచ్చారాయన. గాజాలో ఊచకోతకు పాల్పడుతున్న ఇజ్రాయిల్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. సిరియాలోని ఇరాన్‌ దౌత్య కార్యాలయంపై ఇజ్రాయిల్‌ వైమానిక దాడికి ప్రతీకారం తీర్చుకున్నారు.
అదే సమయంలో ఆయన దేశ ప్రజల ప్రయోజనాల కన్నా రక్షణ రంగతానికే అధిక ప్రాధాన్యత ఇచ్చేవారని, మత విశ్వాసాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ ప్రగతి శీల శక్తులపై నిర్బంధం ప్రయోగించారన్న విమర్శలు కూడా ఉన్నాయి.

 

కూలిన ఇరాన్‌ అధ్యక్షుడి హెలికాప్టర్‌.. రైసీ పరిస్థితిపై ఆందోళన

➡️