ఉత్పత్తిలో స్టీల్‌ప్లాంట్‌ ప్రగతి

Apr 3,2024 10:44 #Steelplant progress
  • అయినా కేంద్ర ప్రయివేటీకరణ చర్యలతో గడ్డు పరిస్థితి

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : ముడి సరుకు లేమి, వివిధ రకాల సవాళ్లు ఎదురైనప్పటికీ 2023 -24 ఆర్థిక సంవత్సరంలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉత్పత్తిలో మెరుగైన ప్రతిభనే కనబరిచింది. గత సంవత్సరం కంటే మంచి ఉత్పత్తిని సాధించింది. ప్లాంట్‌ను ప్రయివేటుపరం చేయాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా వాటిని పోరాటాలతో తిప్పికొడుతూ కార్మికవర్గం శ్రమించడంతోనే ఉత్పత్తి పెరిగింది. అయినప్పటికీ కేంద్ర ప్రయివేటీకరణ చర్యలతో ఆర్థికంగా గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటోంది. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది అధిక వృద్ధిని సాధించినట్లు విశాఖ ఉక్కు యాజమాన్యం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో 7,30,000 టన్నుల వైర్‌ రాడ్‌ కాయిల్స్‌ ఉత్పత్తి చేసింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 43 శాతం అధికం. ఈ ఏడాది ఐదు లక్షల ఎనిమిది వేల టన్నుల స్ట్రక్చరర్స్‌ ఉత్పత్తి చేసింది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 11 శాతం ఎక్కువ. ఈ ఏడాది 13 లక్షల 24 వేల టన్నుల విలువ ఆధారిత ఉక్కు అమ్మకాలు జరిగాయి. ఇదొక సరికొత్త రికార్డు. ఈ విలువ ఆధారిత ఉక్కు అమ్మకాల్లో గత ఏడాదితో పోలిస్తే 37 శాతం వృద్ధి నమోదైందని ప్లాంట్‌ యాజమాన్యం పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం 15 శాతం వృద్ధి సాధిస్తూ 43 లక్షల 12 వేల టన్నుల సేలబుల్‌ స్టీల్‌ విక్రయాలను ప్లాంట్‌ నమోదు చేసింది. మార్కెట్‌ మందగమనం, ముడి పదార్థాలు అందుబాటులో లేకపోవడం వంటి అనేక సమస్యలు ఎదురైనప్పటికీ రూ.23,129 కోట్ల విక్రయాల టర్నోవర్‌ను నమోదు చేసింది. గత సంవత్సరంతో పోలిస్తే రెండు శాతం వృద్ధి ఇక్కడ నమోదైంది. డోర్‌ డెలివరీ ప్రతిపాదన మేరకు 90 వేల టన్నుల స్టీల్‌ను పంపిణీ చేశారు. వివిధ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ స్టీల్‌ప్లాంట్‌ గత ఆర్థిక సంవత్సరంలో ఉక్కు కర్మాగార విస్తరణ యూనిట్లలో అసాధారణ పనితీరు నమోదు చేసిందని ప్లాంట్‌ యాజమాన్యం వెల్లడించింది. విశాఖ ఉక్కు కర్మాగారం విస్తరణ యూనిట్ల నుంచి మొత్తం 1,73,943 టన్నుల ఉత్పత్తి వచ్చింది. అందులో స్పెషల్‌ బార్‌ మిల్‌ నుంచి 5,43,942 టన్ను లు, వైర్‌ రాడ్‌ మిల్‌ నుంచి 6,15,188 టన్నులు, స్ట్రక్చరల్‌ మిల్‌ నుంచి 5,80,413 టన్నులు ఉత్పత్తి జరిగినట్లు యాజమాన్యం తెలిపింది. 47 లక్షల టన్నుల హాట్‌ మెటల్‌, 46 లక్షల టన్నుల లిక్విడ్‌ స్టీల్‌ ఉత్పత్తిని నమోదు చేసిందని, గత సంవత్స రం కంటే ఏడు శాతం వృద్ధిని హాట్‌ మెటల్‌ ఉత్పత్తిలో సాధించినట్లు తెలిపింది. 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో 110 మిలియన్‌ టన్నుల ద్రవ ఉక్కును ఉత్పత్తి చేసినట్లు పేర్కొంది. కార్మికుల కృషి ఫలితంగానే ఈ అభివృద్ధి సాధించినట్లు స్టీల్‌ప్లాంట్‌ సిఎండి అతుల్‌ భట్‌ తెలిపారు. కార్మికులను అభినందించారు.

➡️