2019 ఎన్నికలు.. మసకబారిన శాసనసభ సంప్రదాయాలు

2019 ఎన్నికల్లో వైఎస్‌ జగన్మోహన రెడ్డి నేతృత్వంలోని వైసిపికి అనూహ్య విజయం లభించింది. 175 స్థానాలకుగాను 151 స్థానాల్లో విజయం సాధించింది. రాష్ట్ర రాజకీయ చరిత్రలో జగన్మోహనరెడ్డి పిన్నవయస్కుడైన (46 యేళ్లు) ముఖ్యమంత్రి అయ్యారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఓటమి చెందింది. ఆ పార్టీ కేవలం 23 స్థానాలు మాత్రమే దక్కించుకుంది. జగన్మోహనరెడ్డి గెలుపుతో రాష్ట్ర చరిత్రలో తండ్రీ కొడుకులు ముఖ్యమంత్రులుగా ఎన్నికైన చరిత్రను సొంతం చేసుకున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికలతో కలిసి జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా వైసిపి విజయం సాధించింది. 25 స్థానాలకుగాను 22 స్థానాలు గెలుపొందింది. మిగతా 3 స్థానాలు తెలుగుదేశం పార్టీ వశం అయ్యాయి. కొంచెం వెనక్కి వెళ్తే… 2009 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి తొలిసారిగా ఎంపిగా ఎన్నికయ్యారు. అదే సంవత్సరం సెప్టెంబరులో తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణించారు. వారసుడుగా తనకు ముఖ్యమంత్రిత్వం ఇవ్వలేదనే ఉద్దేశంతో కాంగ్రెస్‌ను వదిలి వైసిపిని స్థాపించారు. ఈ సందర్బంగానే అక్రమాస్తులు కూడబెట్టారనే ఆరోపణపై ఆయనను 2012 మే 27న అరెస్టు చేసి 16 నెలలపాటు చంచల్‌గూడ జైలులో ఉంచారు. 2013 సెప్టెంబరు 23న షరతులతో కూడిన బెయిల్‌ లభించింది. 2014 ఎన్నికలలో టిడిపి విజయం సాధించగా వైసిపి ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. దీంతో రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు.

అవహేళనలు, దూషణలు
2014 ఎన్నికల తర్వాత నుంచి శాసనసభ జరిగే తీరులో పెను మార్పు వచ్చింది. పాలకులు.. ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకొని కక్ష సాధింపుగా వ్యవహరించడం ప్రారంభమైంది.ఈ సంప్రదాయం 2004 నుంచే మొదలైంది. అప్పట్నించే చట్టాలు (శాసనాలు) చేసే శాసనసభ అవహేళనలకు, దూషణలకు నిలయమైంది. స్పీకర్లు సైతం తాము పదవిలో ఉన్నంతకాలం ఎన్నికైన పార్టీని వదిలివేయాల్సి ఉంటుంది. పక్షపాత రహితంగా వ్యవహరించాల్సి ఉంటుంది. స్పీకర్‌ సైతం సభలోనూ, సభ వెలుపలా సొంత పార్టీ కార్యకర్త మాదిరిగా ప్రకటనలివ్వడం వంటివి చోటుచేసుకున్నాయి. 2014 నుంచి ఇది మరింత పేట్రేగిపోయింది. ప్రజాస్వామిక వాదులకు, ప్రజాతం త్రవాదులకు విచారం కలిగించేలా పరిస్థితులు మారిపోయాయి. 2014 తరువాత అధికారం పక్షం నుంచి అవమానాలు, అవహేళనలు భరించలేక ప్రతిపక్ష నాయకుడు జగన్మోహనరెడ్డి తాను అధికారం పీఠం అధిష్టించేవరకూ శాసనసభ సమావేశాలకు హాజరుకాబోనని ప్రతిజ్ఞ చేసి అక్కణ్ణుంచి నిష్క్రమించారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి విజయం సాధించింది. 175 సీట్లకుగాను 151 సీట్లు గెలుపొందింది. 1,56,88,569 (49.95 శాతం) ఓట్లు సంపాదించింది. 175 సీట్లకు పోటీ చేసిన టిడిపికి 23 స్థానాలు మాత్రమే లభించాయి. ఆ పార్టీకి 1,23,04,668 (39.17 శాతం) ఓట్లు లభించాయి. సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌ నేతృత్వంలోని జనసేన 137 స్థానాల్లో పోటీ చేసి 1 స్థానంలో మాత్రమే గెలిచింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, సిపిఐ, సిపిఐ(ఎం), బిజెపి, బిఎస్‌పి పార్టీలకు శాసనసభలో ప్రాతినిథ్యం లభించలేదు. ఈ ఎన్నికల్లో జనసేన, వామపక్షాలు అవగాహనతో పోటీ చేశాయి.

మళ్లీ కక్ష సాధింపు పునరావృతం
2019లో కొత్త శాసనసభలో కూడా పూర్వపు కక్ష సాధింపు సంప్రదాయం జడలు విప్పి నాట్యం చేసింది. 2009లో బాధితుడు జగన్మోహనరెడ్డి అయితే ఇప్పుడు బాధితుడు ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు. ఆయన కూడా అధికార పార్టీ సభ్యుల అవహేళనలను, దూషణలను, ఇంటిలోని వ్యక్తుల పరువు తీసేలా చేసిన వ్యాఖ్యలను భరించలేక శాసనసభ వదిలి వెళ్లి పోయారు. మళ్లీ విజయం సాధించి శాసనసభలో అడుగు పెడతానని ప్రతిజ్ఞ చేసి శాసనసభ నుంచి వెళ్లిపోయారు. వయసు మీద పడిన కారణంగా కుమారుడితో యువజనగళం పాదయాత్ర ప్రారంభింపచేశారు. కొన్నాళ్లు సాగాక రాష్ట్ర ప్రభుత్వపు సిఐడి చంద్రబాబుపై కేసులు పెట్టింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఫైబర్‌ నెట్‌ వంటి కేసుల్లో అవినీతి ఆధారాలున్నాయంటూ కేసులు పెట్టి రాజమండ్రి జైలుకు పంపారు. సుమారు 2 నెలలపాటు ఆయన జైలులో ఉన్నారు. చర్చకురాని ప్రజా సమస్యలు
పాలక, ప్రధాన పక్షాలు వ్యక్తి గత కక్షలకు, కార్పణ్యాలకు వేదికగా తప్ప ప్రజా సమస్యలపై చట్ట సభలో చర్చ జరగడం లేదు. ఒకవేళ ఎవరైనా ప్రజా సమస్య ప్రస్తావిస్తే మీ హయాంలో జరిగిందేమిటి అంటూ అడ్డు సవాళ్లు వేయడం, తద్వారా గందోరగోళం సృష్టించడం పరిపాటిగా మారిపోయింది. ఈలోగా వక్తకు ఇచ్చిన సమయం అయిపోయిందంటూ స్పీకర్‌.. మైక్‌ను వేరే వారికి ఇవ్వడం జరుగుతోంది. ఏదైనా బిల్లు ప్రవేశపెడితే చర్చ జరగడం లేదు. గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలోనే బిల్లు పాస్‌ అయిందని (చట్టం అయిందని) స్పీకర్‌ ప్రకటించేస్తున్నారు. దీంతో శాసనసభ ప్రజా సమస్యల వేదికగా గాక కక్ష సాధింపు సభగా మారిపోయిందని ప్రజల నుంచి వినవస్తోంది. రాయ వీలులేని దూషణలు చేసినా స్పీకర్లు మందలించపోవడం వంటి ఉదాహరణలు పదుల సంఖ్యలో 2014, 2019లో మనం విన్నాం. కన్నాం. ఈ కాలంలో ప్రజా సమస్యలపై పనిచేసి పోలీసుల లాఠీలతో దెబ్బలు తిని, జైళ్లకు వెళ్లే వామపక్షాలు ఎన్నికల్లో గెలవకపోవడం కూడా ప్రస్తుత దిగుజారుడు పరిస్థితికి కారణమన్నది సర్వత్రా వినవస్తోంది.

– యు.రామకృష్ణ

➡️