రైతు సాయం.. తేలేదెన్నడు!

Jun 20,2024 07:42 #Kharif, #rythu
  • ఏరువాక సాగేదెలా? 
  • పిఎం కిసాన్‌తో కలిపితే అంతే..
  • అరకొర లబ్ధికీ అన్నదాతలు దూరం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ప్రభుత్వం అందిస్తామన్న ఆర్థిక సహాయం ఉంటుందా లేదా అనే సందేహాలు ఖరీఫ్‌ వేళ అన్నదాతల్లో వ్యక్తమవుతున్నాయి. గత వైసిపి ప్రభుత్వం వ్యవసాయదారులకు ‘రైతు భరోసా’ పేరిట కేంద్రంతో కలిపి సంవత్సరానికి మూడు విడతల్లో రూ.13,500 ఆర్థిక సహాయం అందించగా, టిడిపి-జనసేన ప్రకటించిన ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోలోని ‘సూపర్‌సిక్స్‌’లో రైతులకు ఏటా రూ.20 వేల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడి వారం దాటినా రైతులకు చేస్తామన్న సాయంపై చర్చే లేదు. పోలవరం, రాజధాని అమరావతి, ఇత్యాది అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానంగా దృష్టి పెట్టారు. కానీ ఖరీఫ్‌ పంటల సాగుకు రైతులు సమాయత్తమవుతుండగా రైతులకు అందించే ఆర్థిక సహాయంపై కదలిక లేకపోవడంతో ఈ ఏడాది సాయం ఉంటుందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పథకం అమలు కావాలంటే అర్హతలు నిర్ణయం కావాలి. పాత ప్రభుత్వం మల్లే కేంద్రానికి చెందిన పిఎం కిసాన్‌ నిబంధనలనే ఇప్పుడూ అమలు చేస్తుందా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం వేరేగా నిబంధనలు రూపొందిస్తుందా అనే సందేహాలను నివృత్తి చేసే వారెవరూ లేరు. ఈ నెల 22న ఏరువాక పౌర్ణమి ఉందని, ఆ నాడు రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించడం సంప్రదాయమని, అప్పటికి ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావొచ్చని ప్రభుత్వవర్గాలు అంచనా వేస్తున్నాయి.

కోతలకే ఆ షరతులు
కేంద్రం అమలు చేస్తున్న పిఎం కిసాన్‌ స్కీంకు నిర్ణయించిన షరతులు లబ్ధిదారుల సంఖ్యకు కోతలు పెడుతున్నాయి. రాష్ట్రం నుంచి రైతుల జాబితాలు పంపేది ఇక్కడి ప్రభుత్వమే. కానీ రాష్ట్ర సర్కారు ఎంపిక చేసి పంపిన రైతుల్లో నుంచి కేంద్రం లక్షల మందిని ఏరేస్తోంది. దరఖాస్తులను తిరస్కరిస్తోంది. సొంత భూమి కలిగిన రైతులకే పిఎం కిసాన్‌ సాయం అన్నందున కౌలు రైతులు కాకుండా ఎ.పి. నుంచి వైసిపి సర్కారు సుమారు 52 లక్షల మంది రైతులను ఎంపిక చేసి పంపగా భూరికార్డులతో అనుసంధానం, ఆధార్‌ సీడింగ్‌, ఆధార్‌ బేస్డ్‌ పేమెంట్స్‌ ఇలా అనేక వడపోతల అనంతరం ప్రస్తుతం 40.91 లక్షల మంది రైతులే అర్హులు. వీరికి ఈ ఏడాది తొలి కిస్తు రూ.2 వేలను మంగళవారం కేంద్రం విడుదల చేసింది. ఇన్ని దశల్లో జల్లెడ పట్టాక కూడా చాలా మందికి సొమ్ము పడలేదని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ర్యాండమ్‌గా (మచ్చుకు) ఐదు శాతం మందిని అధికారులు నేరుగా తనిఖీలు చేయాలని కేంద్రం నిబంధన పెట్టింది. ఆ తనిఖీ పూర్తి కాలేదు. 2023-24లో 1.88 లక్షల లబ్ధిదారుల వివరాలను ప్రత్యక్షంగా తనిఖీ చేయాల్సి ఉండగా 10 వేలు పూర్తి కావడం గగనమైంది. గతేడాది కూడా ఇదే పరిస్థితి. తనిఖీలు పూర్తి కాని లబ్ధిదారులకు తాజా కిస్తు పడిందా లేదా అనే విషయంపై స్పష్టత లేదు.

కలిపితే నష్టం
వైసిపి సర్కారు పిఎం కిసాన్‌తో కలిపి ‘రైతు భరోసా’ను అమలు చేసినందున రాష్ట్ర సర్కారు ఎంపిక చేసి పంపిన లబ్ధిదారుల్లో పది లక్షల మందికి కేంద్ర సాయం జమ కాలేదు. టిడిపి కూటమి సర్కారు కూడా పిఎం కిసాన్‌ నిబంధనలే అంటే ఇదే విధమైన కోతలు పడతాయి. ఆ మేరకు ప్రభుత్వం చేసే అరకొర సాయాన్నీ రైతులు కోల్పోతారు. పిఎం కిసాన్‌ నిబంధనల మేరకే అయితే ఒకేసారి ఏకమొత్తంలో రైతులకు సాయం అందదు. ఏడాదికి మూడు విడతల్లో అందుతుంది. ఆ విధంగా చేసే సాయం పెరిగిన ధరల నేపథ్యంలో రైతుల పెట్టుబడులకు ఏ మూలకూ సరిపోదు. పిఎం కిసాన్‌తో కలిపినందున వైసిపి సర్కారు తను ఇస్తానన్న రూ.13,500 కాకుండా రూ.7,500 మాత్రమే ఇచ్చింది. కేంద్రం నుంచి రూ.6 వేలు తీసుకోమంది. పిఎం కిసాన్‌ నిబంధనల వలన పది లక్షల మందికి రాష్ట్రం ఇచ్చిన 7,500 మాత్రమే అందాయి. కేంద్రం ఇచ్చే రూ.6 వేలు రాలేదు. ఆ మేరకు రైతులు సాయం నష్టపోయారు. విపత్తులతో నష్టాలపాలై ఆర్థిక సంక్షోభంలో ఉన్న రైతులు కేంద్రంతో సంబంధం లేకుండా కూటమి ఎన్నికల హామీ మేరకు రూ.20 వేలూ ఇవ్వాలని కోరుతున్నారు. కేంద్రం కౌలు రైతులకు సహాయం చేయట్లేదు. అందువలన తమకు రూ.26 వేలూ రాష్ట్రమే ఇవ్వాలని వాస్తవ సాగుదార్లు అడుగుతున్నారు.

➡️