వైసిపిలో గ్రూపుల గోల 

Apr 9,2024 06:30 #2024 elections, #Andhra Pradesh
  •  ప్రభావం చూపనున్న కాంగ్రెస్‌

ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : వైసిపిని గ్రూప్‌ రాజకీయాలు కొంపముంచనున్నాయి. నగరి, పూతలపట్టు, జీడీ నెల్లూరులో ఈ ప్రభావం గతేడాదిగా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మంత్రి ఆర్‌కె రోజా, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అభ్యర్థిత్వాన్ని నియోజకవర్గ ద్వితీయశ్రేణి నాయకులు ఆక్షేపిస్తూనే ఉన్నారు. జీడి నెల్లూరులో నారాయణస్వామి పెద్ద కుమార్తెకు అవకాశం ఇచ్చినా ఈ ప్రభావంలో పెద్దగా మార్పు లేదనే చెప్పాలి. చిత్తూరు టిడిపి ఎంపి అభ్యర్థిగా దుగ్గిమళ్ల ప్రసాదరావు బాపట్ల జిల్లా నుంచి వలసొచ్చినా టిడిపి కంచుకోటగా ఉన్న కుప్పం, పలమనేరు నియోజకవర్గాలు కలిసి రానున్నాయి. ‘వైనాట్‌ 175’ నినాదంతో కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు వైసిపి గట్టిగానే ప్రయత్నిస్తోంది. పుంగనూరులో పెద్దిరెడ్డిని దెబ్బతీయాలని టిడిపి చూస్తోంది.
చిత్తూరు జిల్లాలో ఒక పార్లమెంటు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. చిత్తూరు పార్లమెంటు ఎస్‌సి రిజర్వుడు. పూతలపట్టు, జీడీ నెల్లూరు రిజర్వుడు. చిత్తూరు పార్లమెంటు మొత్తం 15,58,257 ఓట్లున్నాయి. వైసిపి నుంచి సిట్టింగ్‌ ఎంపి ఎన్‌ రెడ్డెప్పది పుంగనూరు. టిడిపి నుంచి బాపట్ల జిల్లాకు చెందిన రిటైర్డు ఐఆర్‌ఎస్‌ అధికారి దుగ్గిమళ్ల ప్రసాద్‌రావు పోటీలో ఉన్నారు. బిసి, ఎస్‌సి, మొదలియార్‌ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి.
కుప్పంలో 2,23,311 ఓట్లు న్నాయి. టిడిపి నుంచి మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు గత 35 ఏళ్లుగా బరిలోనే ఉన్నారు. ప్రస్తుతం ఎనిమిదోసారి బరిలో ఉన్నారు. వైసిపి అభ్యర్థిగా ఎమ్మెల్సీ భరత్‌ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి ఆవుల గోపి పోటీ చేసే అవకాశం ఉంది. లక్ష మెజార్టీనే లక్ష్యం అంటూ టిడిపి ప్రచారం చేస్తోంది. అయితే ఈసారి చంద్రబాబును ఓడించేందుకు వైసిపి గట్టి కసరత్తే చేస్తోందని వైసిపి నాయకులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన ‘సిద్ధం’ సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. భరత్‌ను గెలిపిస్తే కేబినెట్‌లో మంత్రిని చేస్తానని సభాముఖంగానే ప్రకటించారు. పలమనేరులో టిడిపి నుంచి మాజీ మంత్రి ఎన్‌ అమరనాథరెడ్డి బరిలో ఉన్నారు. వైసిపి నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే వెంకటెగౌడ ఉన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా శివశంకర్‌ పోటీలో ఉన్నారు. ‘రెడ్డి’ సామాజిక ఓట్లు చీల్చే అవకాశం లేకపోలేదు. ఈ నియోజకవర్గంలో 2,67,178 ఓట్లున్నాయి.
పూతలపట్టులో వైసిపి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే సునీల్‌ పోటీలో ఉన్నారు. టిడిపి నుంచి ప్రముఖ జర్నలిస్టు మురళీ మోహన్‌ బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు బరిలో ఉన్నారు. ఇక్కడ వైసిపి, టిడిపి ఓట్లు కూడా ఆయనకు పడే అవకాశం ఉంది. అయితే మాజీ ఎమ్మెల్యే లలితకుమారి సిద్ధం సభలో వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. చిత్తూరు ఎమ్మెల్యే సికెబాబు తనకు పట్టున్న యాదమరి, బంగారుపాళ్యం, తవణంపల్లిలో టిడిపిని తరఫున ప్రచారం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో 2,21,077 ఓట్లున్నాయి. చిత్తూరులో టిడిపి నుంచి గురజాల జగన్‌మోహన్‌రావు బరిలో ఉన్నారు. వైసిపి నుంచి ఆర్‌టిసి జోనల్‌ ఛైర్మన్‌గా ఉన్న విజయానందరెడ్డి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి టి కారమ్‌ బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 2,01,741 ఓట్లున్నాయి. జీడీ నెల్లూరులో కాంగ్రెస్‌ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. ఈ నియోజకవర్గంలో 2,05,123 ఓట్లున్నాయి. వైసిపి నుంచి డిప్యూటీ సిఎం నారాయణస్వామి కుమార్తె కళత్తూరు కృపాలక్ష్మి బరిలో ఉన్నారు. టిడిపి నుంచి థామస్‌ తొలిసారి పోటీలో ఉన్నారు.

రోజాపై సొంత పార్టీలోనే వ్యతిరేకత
నగిరిలో వైసిపి నుంచి మంత్రి ఆర్‌కె రోజా బరిలో ఉన్నారు. ఆమెపై సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది. టిడిపి నుంచి మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు పెద్ద కుమారుడు గాలి భానుప్రకాష్‌ నాయుడు రెండోసారి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాకేష్‌రెడ్డి పోటీలో ఉన్నారు. ఆయన యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 2,01,607 ఓట్లున్నాయి.

➡️