ఈ ఏడాదీ పుస్తకాలు లేనట్లేనా!

May 27,2024 04:30 #ap government, #AP Inter, #books
  • జూన్‌ 1 నుంచి ఇంటర్‌ తరగతులు
  • విద్యార్థులకు తప్పని అదనపు భారం

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు ఈ ఏడాదీ పాఠ్య పుస్తకాలు సకాలంలో అందే పరిస్థితులు కనిపించట్లేదు. ఇంటర్‌ విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలా లేవు. గత ఏడాది అందరికీ పాఠ్యపుస్తకాలు అందలేదు. అంతకు ముందు సంవత్సరం విద్యార్థులకు అరకొరగా మాత్రమే అందాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 44 ప్రభుత్వ ఇంటర్మీడియట్‌ కళాశాలల్లో సుమారు 1.45 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ ప్రభుత్వం ఏటా ఉచితంగా పాఠ్య పుస్తకాలను అందించాలి.

విద్యార్థులపై అదనపు భారం
జూన్‌ ఒకటి నుంచి ఇంటర్మీడియట్‌ తరగతులు ప్రారంభం కానున్నా ఇంతవరకు జిల్లాకు ఒక్క పాఠ్యపుస్తకం కూడా చేరలేదు. తరగతులు ప్రారంభం కావడానికి వారం రోజులు మాత్రమే గడువు ఉండడంతో పుస్తకాలు ఊసే లేకపోవడంతో ఈసారి కూడా విద్యార్థులపై అదనపు భారం పడనుంది. బయట మార్కెట్లో జూనియర్‌, సీనియర్‌ ఇంటర్‌ పాఠ్యపుస్తకాలను రూ.1,550 నుంచి రూ.1,800 వరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇవి కూడా పూర్తి స్థాయిలో దొరకడం లేదు. ఇంగ్లీషు, తెలుగు మీడియం కలిపి ఎంపిసి, బైపిసి విద్యార్థులకు చెందిన తెలుగు లేదా సంస్కృతం పాఠ్యపుస్తకం రూ.150, ఇంగ్లీషు రూ.220, వన్‌-ఎ రూ.320, వన్‌-బి రూ.300, ఫిజిక్స్‌ రూ.280, కెమిస్ట్రీ రూ.280, బోటనీ రూ.220, జువాలజీ పాఠ్యపుస్తకం రూ.230కు, ఆర్ట్స్‌ గ్రూపులకు చెందిన తెలుగు, ఇంగ్లీషు మీడియం వారికి తెలుగు పాఠ్యపుస్తకం రూ.150, ఇంగ్లీషు రూ.230, ఎకనామిక్స్‌ రూ.200, కామర్స్‌ రూ.180, కామర్స్‌ థియరీ రూ.150, సివిక్స్‌ పాఠ్యపుస్తకం రూ.180కు అమ్ముతున్నారు. పాఠ్య పుస్తకంపై ఉన్న ధర కంటే ఒక్కో పుస్తకానికి అదనంగా రూ.40 నుంచి రూ.50 వరకూ వ్యాపారులు వసూలు చేస్తున్నారు. పాఠ్యపుస్తకాల భారాన్ని మోయలేకున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం సకాలంలో పుస్తకాలను అందించాలని వారు కోరుతున్నారు.

నిలిపేయడం సరికాదు : ఎం.సూరిబాబు, ఎస్‌ఎఫ్‌ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి
2025లో సిబిఎస్‌ఇ సిలబస్‌ను ప్రవేశ పెడతామనే కారణంతో ఇంటర్‌ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాల్సిన పాఠ్య పుస్తకాలను నిలివేయడం సరికాదు. పేద, మధ్య తరగతి విద్యార్థులకు విద్యను దూరం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పేద విద్యార్థులు మార్కెట్లో అధిక ధరలకు పుస్తకాలు కొనుక్కోలేరు. తక్షణమే అధికారులు స్పందించి ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించాలి.

➡️