ఎరువుల అమ్మకానికి విఎఎలు

Feb 4,2024 08:24 #fertilizers, #sale, #VAA
  • ఈ ఏడాది ఆర్‌బికెల ద్వారా 10.5 లక్షల టన్నుల టార్గెట్‌
  • గ్రామ స్థాయిలో అధికారపార్టీ జోక్యం
  • వ్యవసాయ సహాయకులపై తీవ్ర ఒత్తిడి
  • రైతులకు సలహాలు గాలికి

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : రైతుల చెంతకే సేవలంటూ ప్రభుత్వం వినూత్నంగా నెలకొల్పిన రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికె) సిబ్బందిని విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల సేల్స్‌ సిబ్బందిగా మార్చేసింది. లక్ష్యాలు విధించి మరీ ప్రైవేటు సంస్థల ఉత్పత్తులు అమ్మాలని లక్ష్యాలు విధిస్తోంది. రైతుల ఆదరణ లేకపోయినా సరుకు అమ్మాల్సిందేనని హుకుం జారీ చేసింది. ప్రభుత్వ ఒత్తిళ్లకు సిబ్బంది తాళలేకపోతున్నారు. ఈ క్రమంలోనే రెండ్రోజుల క్రితం బాపట్ల జిల్లాలో పూజిత అనే విలేజి అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ (విఎఎ) ఆత్మహత్య చేసుకుంది. ఇంకా రెండు చోట్ల మరో ఇద్దరు విఎఎలు బలవన్మరణానికి ప్రయత్నించారు. ప్రైవేటు డీలర్ల, దుకాణదారుల బ్లాక్‌ మార్కెట్‌ను, అక్రమాలను అరికట్టేందుకే ఆర్‌బికెలలో వ్యవసాయ ఉత్పాదకాల అమ్మకాలని ప్రభుత్వం సమర్ధించుకుంటున్నప్పటికీ, రైతులకు సాగులో మెలకువలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన, శిక్షణ, సలహాలు ఇవ్వాల్సిన గ్రామ స్థాయి సిబ్బందిని ఆర్‌బికె దుకాణాలు నడిపేవారిగా తయారు చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

10.50 లక్షల టన్నులు

                   2023-24 ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్‌, రబీ కలుపుకొని రాష్ట్ర రైతులకు 38 లక్షల టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనా వేసి ఆ మేరకు కేంద్రం నుంచి కేటాయింపులు చేయించారు. వాటిలో 10.50 లక్షల టన్నులను ఆర్‌బికెలలో రైతులకు అమ్మించాలని లక్ష్యాలు రూపొందించారు. సీజన్‌ వారీగా, నెల వారీగా ఎంతెంత సేల్‌ చేయాలో టార్గెట్లిచ్చారు. క్రమానుగతంగా వ్యవసాయ స్పెషల్‌ కమిషనర్‌ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌ల్లో తప్పకుండా ఎరువుల సేల్స్‌ ఎజెండా ఉంటుంది. జిల్లా అగ్రికల్చర్‌ అధికారులకు (డిఎఒ) సేల్స్‌పై సూచనలు చేస్తున్నారు. ఎడిలు, ఎంఎఒలు తమ పరిధిలోని ఆర్‌బికెలలో పని చేసే విఎఎలను సేల్స్‌పై కదిలించాలని ఇండెంట్లు పెట్టించాలని ఒత్తడి చేస్తున్నారు. రైతుల నుంచి ఆదరణ లేకపోవడంతో ఈ ఏడాది టార్గెట్‌ను 8.77 లక్షల టన్నులకు తగ్గించారు. కాగా జనవరి నెలాఖరు నాటికి ఆర్‌బికెల నుంచి 4.32 లక్షల టన్నులకే ఇండెంట్లు వచ్చాయి. ఇండెంట్‌ పెట్టిన దాంట్లో 4.22 లక్షల టన్నులను మార్క్‌ఫెడ్‌ నుంచి సరఫరా చేయగా 3.71 లక్షల టన్నులను సేల్‌ చేశారు.

7 కోట్ల బకాయిలు

                  రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌బికెల నుంచి మార్క్‌ఫెడ్‌కు మూడు నెలలు దాడిన బకాయిలు రూ.7 కోట్ల వరకు ఉన్నాయని గురువారం స్పెషల్‌ కమిషనర్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తేల్చారు. ఈ మొత్తాన్ని 15 రోజుల్లో సంబంధిత విఎఎల నుంచి వసూలు చేసి మార్క్‌ఫెడ్‌కు కట్టాలని, బకాయి ఉన్న విఎఎలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని, సరైన వివరణ ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని డిఎఒలను, ఎడిఎలకు, ఎంఎఒలను ఆదేశించారు. ఎప్పుడైతే కమిషనర్‌ నుంచి ఇటువంటి ఆదేశాలు వెళ్లాయో విఎఎలు గజగజ ఒణికిపోతున్నారు. ఆ ప్రభావమే బాపట్లలో పూజిత ఆత్మహత్య. మరో ఇద్దరు విఎఎల ఆత్మహత్యాయత్నంగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా మార్క్‌ఫెడ్‌ నుంచి ఆర్‌బికెలకు సరఫరా చేసిన ఎరువుల్లో 67 వేల టన్నుల నిల్వలకు లెక్కలు తేలట్లేదని సమాచారం. సంవత్సరం నుంచి ఈ పరిస్థితి ఉండటంతో దానిపైనా కమిషనరేట్‌ దృష్టి సారించింది. తక్షణం డిఎఒలు, కింది స్థాయి అధికారులు నిల్వలపై సమీక్షించాలని, ప్రత్యేక బృందాలను నెలకొల్పి ఆర్‌బికెలను సందర్శించాలన్నారు. ఈ ఒత్తిడి కూడా విఎఎలపై ఉంది. ఆర్‌బికెల అద్దె, వాటి నిర్వహణపై గ్రామ స్థాయిలో అధికారపార్టీ జోక్యం వ్యవసాయ సహాయకుల కొంప ముంచుతోంది. కొన్ని చోట్ల విఎఎలు, ఆపై అధికారులు అవినీతికి పాల్పడటం కూడా చిరుద్యోగుల మెడకు చుట్టుకుంటోందని తెలుస్తోంది.

➡️