సామర్థ్యం లేదా? సహకారం లేకనా?

Dec 7,2023 08:29 #visakha steel
visakha-steel-plant manganese mines

‘ఉక్కు’ నష్టాలపై అభూతకల్పనలు
పది నెలలుగా బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను మూత పెట్టిన కేంద్రం
మాంగనీసు నిల్వలపై మౌనం దాల్చిన రాష్ట్రం

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : విశాఖ ఉక్కు కర్మాగారం ఉసురు బలవంతంగా తీసేయ్యాలని కేంద్రంలోని బిజెపి సర్కారు కుట్రలు చేస్తోంది. ఈ కర్మాగారాన్ని నష్టపరిచే చర్చలకు ఒడిగట్టింది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యమూ ఉంది. నష్టాల పేరుతో కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ‘ఉక్కు నష్టాలు 2023-24 తొలి ఆర్థిక సంవత్సరంలో రూ.2050 కోట్లు’ అంటూ ఈ నెల 3న రాజ్యసభలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్‌సింగ్‌ కులస్థే చేసిన ప్రకటన తాజాగా కార్మికవర్గంలో ఆగ్రహాన్ని రగిలిస్తోంది.ఉక్కు కర్మాగారంలో మూడు ఫర్నేస్‌లకుగానూ 25 లక్షల టన్నుల స్టీలు ఉత్పత్తి చేసే ఒక ఫర్నేస్‌ను ఈ ఏడాది జనవరిలో మూసేసింది. సామర్థ్యం ఉంటుండగానే దీని పీకనులిమేసింది. దీంతో, ఉత్పత్తి తగ్గింది. ప్రధాని మోడీ ఇటీవల ఓ ప్రకటన చేస్తూ 2030 నాటికి దేశీయ అవసరాలకు 300 మిలియన్‌ టన్నులు స్టీల్‌ కావాలని, ప్రస్తుతం 140 మిలియన్‌ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోందని వెల్లడించారు. కానీ, ఉక్కు ఉత్పత్తి పెంచేందుకు తీసుకుంటున్న చర్యలను మాత్రం వెల్లడించలేదు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఏటా 25 లక్షల మిలియన్‌ టన్నులు ఉత్పత్తి చేసే ఫర్నేస్‌ను ఎందుకు ఆపేశారని కేంద్ర స్టీల్‌ మంత్రిని విశాఖ కార్మిక సంఘాలు ఢిల్లీలో గత మార్చిలో కలిసి వివరణ కోరగా, ‘చూస్తాం… మీరెళ్లండి’ అంటూ సమాధానపరచారు. ఆ తర్వాత ప్లాంట్‌కు సెక్రటరీలు, కేంద్ర మంత్రులు వచ్చారు… వెళ్లారు తప్ప… ప్లాంట్‌ ప్రగతికి తీసుకున్న చర్యలు శూన్యం. కేంద్రానిది బాధ్యత కాదా?వాస్తవానికి ఉక్కు ఉత్పత్తి అధికంగా వస్తే స్టీల్‌ ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. మార్కెట్‌లో స్టీల్‌ టన్ను ఖరీదు రూ.64 వేలు వరకూ ఉంది. స్టీల్‌ప్లాంట్‌లోని ఒక ఫర్నేస్‌లో 25 లక్షల టన్నుల ఉత్పత్తి నిలిచిపోయింది. అదీ పనిచేస్తే రూ.వేల కోట్లు విలువ చేసే స్టీల్‌ బయటకొస్తుంది. దీనిపై 18 శాతం పన్ను కింద ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.3200 కోట్లు ఆదాయం చేకూరుతుంది. ఈ వాస్తవాలన్నింటినీ పక్కన పెట్టేసి రూ.వేల కోట్లతో సిద్ధం చేసుకున్న యంత్రాలను నిరుపయోగంగా ఉంచడం వల్ల నష్టాలు రావా? అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. 2018-19లో మొత్తం టర్నోవర్‌లో 85 శాతం ఉత్పత్తి రాగా, 2020-2021లో 65 శాతానికి ఇది పడిపోయింది. రూ.3 లక్షల కోట్ల విలువైన ఉక్కు కర్మాగారానికి వర్కింగ్‌ కేపిటల్‌ కింద రూ.3 వేల కోట్లును ప్రభుత్వం ఇవ్వకపోవడం దారుణమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఎపి ప్రభుత్వ భాగస్వామ్యం ఇలా.. విజయనగరం జిల్లాలోని గర్భాం వద్ద మాంగనీసు ఖనిజం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. 1982 అక్టోబర్‌లో స్టీల్‌ప్లాంట్‌ కోసం 40 ఏళ్లు లీజుకు ఇచ్చారు. 2022 తరువాత ఆటోమేటిక్‌గా అంటే (డీమ్డ్‌ టు బి ఎక్స్‌టెండ్‌) చేసుకోవచ్చు. ఇది రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిగా దీనిపై నోరుమెదపడం లేదు. దీంతో, మాంగనీసు లీజు విస్తరణకు నోచుకోవడం లేదు. నాడు రూ.3 వేలుకే టన్ను మాంగనీసు ఓర్‌ గర్భాం మైనింగ్‌ నుంచి లభించేది. ఏడాది కాలంగా ఈ మాంగనీసు టన్నును రూ.13 వేలకు స్టీల్‌ప్లాంట్‌ బయట కొనుక్కుంటోంది. మూడో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను వెంటనే ప్రారంభించాలిస్టీల్‌ప్లాంట్‌పై అడుగడుగునా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయి. ప్లాంట్‌కు లాభాలు తెచ్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం విజయనగరం జిల్లా గర్భాం వద్ద మాంగనీసు గనులను పదేళ్లపాటు లీజుకు తక్షణం ఇవ్వాలి. సారిపల్లి ఇసుక మైన్స్‌గానీ, ప్రత్యామ్నాయంగా వేరే మైన్స్‌నుగానీ కేటాయించాలి. దీనిపై రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను కలిసి వివరించాం. జె.అయోధ్యరామ్‌, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్‌

➡️