సమాన పనికి సమాన వేతనం ఏది?

Mar 8,2024 10:34 #womens salary

జీతాలలో భారీ వ్యత్యాసాలు

యాజమాన్యాలతోచర్చించడంలోనూ సమస్యలే

పని ప్రదేశంలో లింగ వివక్ష

మహిళా ఉద్యోగులపై క్రిసిల్‌, డిబిఎస్‌ సర్వే

న్యూఢిల్లీ : ‘సమాన పనికి సమాన వేతనం’ అనే సిద్ధాంతం మహిళలకు వర్తించడం లేదు. పురుషులతో సమానంగా వారు విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ జీతాలు మాత్రం తక్కువగానే ఉంటున్నాయి. ఉద్యోగాలు చేస్తున్న మహిళల్లో 23% మంది ఇలా తక్కువ జీతాలతో సరిపెట్టుకుంటు న్నారు. 16% మంది మహిళా ఉద్యోగులు వివక్షను ఎదుర్కొంటున్నారు. రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌, డీబీఎస్‌ బ్యాంక్‌ ఇండియా నిర్వహించిన సర్వే ప్రకారం 69% మహిళా ఉద్యోగులు ప్రధానంగా మెరుగైన జీతాన్ని, కెరీర్‌లో ఉన్నతిని కోరుకుంటున్నారు. స్వయం ఉపాధి పొందుతున్న మహిళల్లో 42% మంది స్వతంత్రతకు, అనుకూలమైన పనిగంటలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఆసక్తికరమైన విషయమేమంటే కేంద్ర కార్యాలయాల్లో కాకుండా బ్రాంచీలలో పనిచేయడానికి మహిళా ఉద్యోగులు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కేవలం 3 శాతం మంది మాత్రమే బ్రాంచి కార్యాలయాల్లో పనిని కోరుకుంటున్నారు. ఇక స్వయం ఉపాధి పొందుతున్న మహిళల విషయానికి వస్తే సంపదను పెంచుకోవడం, వ్యాపారంలో పురోభివృద్ధి సాధించడంపై ఆసక్తిని కనబరుస్తున్నారు. దేశంలోని పది నగరాల్లో పనిచేస్తున్న 800 మంది మహిళా ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న వారిని ఇంటర్వ్యూ చేసి ఈ సర్వేను రూపొందించారు.

వేతనాలలో తేడాలు

పురుష, మహిళా ఉద్యోగుల మధ్య వేతన వ్యత్యాసం ఎక్కువగానే ఉంది. రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ వార్షిక వేతనం తీసుకుంటున్న పురుష, మహిళా ఉద్యోగుల మధ్య వేతన వ్యత్యాసం 18 శాతం ఉంటోంది. అదే రూ.41 లక్షల నుండి రూ.55 లక్షల వరకూ వార్షిక వేతనం తీసుకుంటున్న వారి మధ్య వేతన వ్యత్యాసం 30 శాతంగా ఉంది. పని ప్రదేశంలో కూడా లింగ వివక్ష కన్పిస్తోంది. రూ.41-55 లక్షల మధ్య వార్షిక వేతనం తీసుకుంటున్న మహిళా ఉద్యోగుల్లో 30 శాతం మంది వరకూ తాము లింగ వివక్షను ఎదుర్కొన్నామని తెలిపారు. రూ.10-25 లక్షల వార్షిక వేతనం అందుకుంటున్న మహిళా ఉద్యోగుల్లో మాత్రం 12 శాతం మంది మాత్రమే ఈ రకమైన వివక్షకు గురవుతున్నారు.

‘జీతాల’ సమస్యలు

మెట్రో నగరాల్లో పనిచేస్తున్న 42 శాతం మహిళా ఉద్యోగులు తమ యాజమాన్యాలతో జీతాల గురించి చర్చించే సమయంలో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో వారి అనుభవాలు భిన్నంగా ఉన్నాయి. కొల్‌కతాలో పనిచేస్తున్న 96 శాతం మహిళా ఉద్యోగులు జీతాలపై చర్చించే సమయంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కోవడం లేదు. అహ్మదాబాద్‌లో మాత్రం 33 శాతం మందికి సమస్య ఎదురవుతోంది. చెన్నైలో 77 శాతం మందికి, హైదరాబాద్‌లో 41 శాతం మందికి సవాళ్లు తప్పడం లేదు.

ఆరోగ్యానికి ప్రాధాన్యత

ఇక మహిళలకు పని ప్రదేశంలో తగినంత విశ్రాంతిని కల్పించే విధానాలపై పూనేలో 35 శాతం మంది ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో జాతీయ సగటు 5 శాతంగా నమోదైంది. మెట్రో నగరాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు బిజీ షెడ్యూల్‌ మధ్య కూడా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. గత సంవత్సరం 66 శాతం మంది మహిళా ఉద్యోగులు సమగ్ర ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.

ఖర్చు ఎక్కువే

మహిళా ఉద్యోగుల్లో కేవలం 32% మంది మాత్రమే వారానికి ఒకసారి బయటికి భోజనానికి వెళుతున్నారు. లేదా ఆహారాన్ని ఆర్డర్‌ చేస్తున్నారు. మహిళా ఉద్యోగుల్లో 24 శాతం మంది రోజుకు నాలుగు గంటలకు పైగా పాటు ఆఫీసు పనికి దూరంగా ఉంటున్నారు.

వివాహిత ఉద్యోగుల్లో 32 శాతం మంది గత సంవత్సరం 3-5 సార్లు విశ్రాంతి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లారు. అవివాహిత మహిళలతో పోలిస్తే ఇది రెట్టింపుగా ఉంది. సర్వేలో పాల్గొన్న మహిళల్లో దాదాపు సగం మంది (47 శాతం) తమ ఆదాయంలో 70 శాతానికి పైగా ఖర్చు చేస్తున్నారు. వీరిలో 39 శాతం మంది విహార యాత్రలు, షాపింగ్‌ కోసం తమ వద్ద ఉన్న క్రెడిట్‌ కార్డులను ఉపయోగిస్తున్నారు. ఈ విషయంలో పాన్‌-ఇండియా సగటు 33 శాతంగా ఉంది.

➡️