భవితవ్యమేమిటో?

  • మళ్లీ బరిలో ‘ముగ్గురు నాని’లు
  •  అసెంబ్లీకి ఆళ్ల, కొడాలి, లోక్‌సభకు కేశినేని పోటీ

ఈసారి ఎన్నికల బరిలోనూ ముగ్గురు నానిలు బరిలో ఉన్నారు. ఇద్దరు అసెంబ్లీకి, మరొక్కరు పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నిల్లో 151 స్థానాలు గెల్చుకున్న సిఎం జగన్‌ తన మొదటి కేబినెట్‌లోకి ముగ్గురు మంత్రులు నాని పేరుతో ఉన్నవారికి అవకాశం కల్పించారు. వారిలో ఏలూరు జిల్లా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఆళ్ల కాళీకృష్ణశ్రీనివాస్‌ (నాని), కృష్ణా జిల్లా గుడివాడ నుంచి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), మచిలీపట్నం నుంచి పేర్ని వెంకట్రామయ్య (నాని). వీరు ముగ్గురూ వైసిపి నుంచి గెలుపొందారు. మూడేళ్ల తర్వాత రెండోదశ మంత్రివర్గ విస్తరణలో ముగ్గురు నానిలకు చోటు దక్కలేదు. ఆళ్ల, కొడాలి నాని తిరిగి ఈ ఎన్నికల్లో పోటీచేస్తుండగా, పేర్ని నాని తన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)ని నిలబెట్టారు. అయితే విజయవాడ పార్లమెంటు బరిలో టిడిపి నుంచి వైసిపిలోకి చేరిన కేశినేని శ్రీనివాసరావు (నాని) అనూహ్యంగా సీటును దక్కించుకున్నారు. ఇప్పుడు ఈ విధంగా చూస్తే మళ్లీ ముగ్గురు నానిలు అయ్యారు. కేశినేని నాని 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి టిడిపి తరపున గెలుపొందిన విషయం తెలిసిందే. గుడివాడ శాసనసభ్యులు కొడాలి నాని ఆహర్యం వేరుగా ఉంటుంది. రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రిగా ఉన్న సమయంలో కూడా కొడాలి నాని తన శాఖ కంటే కూడా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించటం, టిడిపినీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్‌ను తిట్టడానికే ఎక్కువ సమయం కేటాయించారనే ఆరోపణలున్నాయి. బూతులు మంత్రిగా కూడా టిడిపి వారు నానిపై విమర్శలు గుప్పిస్తుంచారు. మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని నాని కూడా రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, రవాణాశాఖ మంత్రిగా గతంలో పనిచేశారు. ఇప్పుడు వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌ను ఒప్పించి తన కుమారుడుకు సీటు ఇప్పించుకున్నారు. ఏలూరుకు చెందిన ఆళ్ల నాని ప్రచారానికి దూరంగా ఉంటారు. పెద్దగా హడావుడి లేకుండా తనవంతుగా తన పనులు చేసుకుంటూపోతారు. జగన్‌కు వీరవిధేయుడుగా ఉండటం వల్ల ఆయనకు మళ్లీ టికెట్టు వచ్చింది అని ప్రచారం జరుగుతోంది.

వీరవిధేయుడుగా ఆళ్లకు గుర్తింపు
ఆళ్ల నాని 1994 నుంచి 2019 వరకూ ఆరుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయగా 2004, 2009లో కాంగ్రెస్‌, 2019 వైసిపి తరపున గెలుపొందారు. కాంగ్రెస్‌ హయాంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, వైసిపి ప్రభుత్వంలో సిఎం వైఎస్‌ జగన్‌కు వీరవిధేయుడుగా ఉన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రితోపాటుగా ఉపముఖ్యమంత్రిగా అవకాశం దక్కటంతో మూడేళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు. ప్రస్తుతం ఆళ్ల నాని తిరిగి పోటీచేస్తుండగా టిడిపి, బిజెపి, జనసేన తరపున బడేటి రాధాకృష్ణ (చంటి) రంగంలో ఉన్నారు.

ప్రతిపక్షంపై దాడే కొడాలి అస్త్రం
2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి తరపున కొడాలి నాని గెలుపొందారు. 2012లో టిడిపిని వీడి వైసిపిలో చేరారు. 2014, 2019లో వైసిపి తరపున గెలుపొందారు. గత ఎన్నికల్లో అప్పటి టిడిపి అభ్యర్థి దేవినేని అవినాష్‌పై 19,479 ఓట్ల తేడాతో గెలుపొందారు. దేవినేని అవినాష్‌ వైసిపిలో చేరి విజయవాడ తూర్పు అభ్యర్థిగా బరిలో ఉన్నారు. 2019లో వైసిపి అధికారంలోకి రాగా కొడాలి రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల మంత్రిగా పనిచేశారు. ఈసారి వైసిపి తరపున కొడాలి నాని, టిడిపి తరపున వెనిగండ్ల రాము పోటీచేస్తున్నారు.

పేర్ని వారసత్వ రాజకీయాలు
బందరులో నాని తనయుడు కిట్టు బరిలో ఉన్నారు. 2019లో వైసిపి, 2009, 2004లో కాంగ్రెస్‌ తరపున నాని గెలుపొందారు. ఆయన తండ్రి పేర్ని కృష్ణమూర్తి 1989లో గెలిచి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. కొల్లు రవీంద్ర, ఆయన మామ నడకుదుటి నరసింహారావు టిడిపి ప్రభుత్వ హయాంలో మంత్రులుగా పనిచేశారు. పేర్ని నానికి ప్రత్యర్థి కొల్లు రవీంద్ర, ఇప్పుడు ఆయన తనయుడు పేర్ని కిట్టుపై పోటీచేస్తున్నారు.

విజయవాడలో కేశినేని బ్రదర్స్‌ రసవత్తర పోరు
విజయవాడ లోక్‌సభ బరిలో ఈసారి కేశినేని శ్రీనివాసరావు (నాని), ఆయన సోదరుడు కేశినేని శివనాథ్‌ (చిన్ని) మధ్య రసవత్తంగా పోరు జరగనుంది. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో అన్న విజయం కోసం పనిచేసిన చిన్ని ఇప్పుడు తన విజయం కోసం అర్రులు చాస్తున్నారు. మొదటి నుంచి చంద్రబాబు వైఖరిపై విమర్శలు గుప్పిస్తున్న కేశినేని నానికి చెక్‌పెట్టడానికి పూనుకుంటున్నారన్న విషయాన్ని గ్రహించిన నాని ఆ పార్టీ నుంచి బయటపడేందుకు పెద్దయెత్తునే వ్యూహాత్మంగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో టిడిపి మూడు పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకోగా, అందులో విజయవాడ ఒకటి. రెండోసారి గెలుపొందిన తర్వాత మొదట్లో చంద్రబాబుకు దగ్గరగా ఉన్న నాని ఆ తర్వాత దూరంగా జరగటం ప్రారంభించారు. అవకాశం చిక్కినప్పుడల్లా తన అసంతృప్తినీ, ఆగ్రహాన్ని బహిరంగంగా వ్యక్తం చేశారు. అన్న వ్యవహారశైలిపై అధిష్టానం ఆగ్రహంతో ఉన్న విషయాన్ని పసిగట్టిన కేశినేని చిన్ని చాపకింద నీరులా పార్టీలోకి యాక్టివ్‌రోల్‌ను మరింగా పెంచారు. దీంతో చిన్నిని తెరపైకి తెచ్చేశారు. ఈ వైరం ఈ రోజుది కాదని, గత కొన్నేళ్లుగా కొనసాగుతోందని అన్నదమ్ములిద్దరూ ఇప్పుడు చెప్పుకుంటున్నారు.

-యడవల్లి శ్రీనివాసరావు

➡️