నంద్యాల ఎవరి సొంతం?

Apr 16,2024 08:21 #2024 elections, #ap election, #nandyala
  •  వైసిపి, టిడిపి బలీయంగా ఉన్నా ఇండియా వేదికకు చోటు

ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి : నంద్యాల జిల్లాలో ఒక పార్లమెంటు, 7 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలున్నాయి. నంద్యాల పార్లమెంటు, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, శ్రీశైలం, డోన్‌, నందికొట్కూరు, పాణ్యం అసెంబ్లీ స్థానాలున్నాయి. టిడిపి కూటమి, వైసిపి అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను ప్రకటించాయి. నంద్యాల, నందికొట్కూరు స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించింది. పాణ్యం నుంచి ఇండియా వేదిక తరపున సిపిఎం అభ్యర్థిని ప్రకటించారు.

లోక్‌సభ
నంద్యాల పార్లమెంటుకు టిడిపి తరపున బైరెడ్డి శబరి, వైసిపి తరపున పోచా బ్రహ్మానందరెడ్డి బరిలో ఉన్నారు. బైరెడ్డి శబరి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి కుమార్తె. బిజెపి నంద్యాల జిల్లా అధ్యక్షులుగా ఉంటూ ఇటీవల టిడిపిలో చేరారు. పోచా బ్రహ్మానందరెడ్డి 2019లో వైసిపి తరపున ఎంపిగా గెలిచారు. ఈసారి కూడా వైసిపి ఆయనకే టికెట్‌ కేటాయించింది. కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటు అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు.

ఆళ్లగడ్డపై అందరి చూపు
నంద్యాల అసెంబ్లీకి టిడిపి తరపున ఎన్‌ఎం.డి.ఫరూక్‌, వైసిపి తరపున శిల్పా రవిచంద్ర కిషోర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ తరపున గోకుల్‌ కృష్ణారెడ్డి బరిలో ఉన్నారు. ఫరూక్‌ టిడిపి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. రవిచంద్ర కిషోర్‌ రెడ్డి వైసిపి తరపున సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆళ్లగడ్డలో టిడిపి తరపున భూమా అఖిల ప్రియ, వైసిపి తరపున గంగుల బిజేంద్రారెడ్డి బరిలో ఉన్నారు. అఖిల ప్రియ టిడిపి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. బిజేంద్రారెడ్డి వైసిపి తరపున సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత టిడిపికి అనుకూలంగా మారనుంది. బనగానపల్లెలో టిడిపి తరపున బిసి జనార్ధన్‌ రెడ్డి, వైసిపి తరపున కాటసాని రామిరెడ్డి బరిలో ఉన్నారు. శ్రీశైలంలో టిడిపి తరపున బి రాజశేఖర్‌ రెడ్డి, వైసిపి తరపున శిల్పా చక్రపాణి రెడ్డి బరిలో ఉన్నారు.
డోన్‌ టిడిపి తరపున కోట్ల జయ సూర్యప్రకాశ్‌ రెడ్డి, వైసిపి అభ్యర్థిగా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి బరిలో ఉన్నారు. కోట్ల జయసూర్య ప్రకాష్‌ రెడ్డి కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వైసిపి తరపున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నారు. నందికొట్కూరులో టిడిపి అభ్యర్థిగా గిత్తా జయసూర్య, వైసిపి తరపున దారా సుధీర్‌, కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్‌ బరిలో ఉన్నారు.

సిపిఎం పోరాటాలు
ఇండియా వేదిక సీట్ల సర్దుబాట్లలో భాగంగా కర్నూలు నుంచి కాకుండా పాణ్యం నుంచి సిపిఎం పోటీ చేస్తోంది. సిపిఎం కర్నూలు జిల్లా కార్యదర్శి డి గౌస్‌ దేశారుని అభ్యర్థిగా ప్రకటించింది. పాణ్యం నియోజకవర్గంలో సిపిఎం అనేక పోరాటాలు నిర్వహించింది. కల్లూరు, ఓర్వకల్లు, పాణ్యం, గడివేములలో భూ నిర్వాసితుల తరపున పోరాటాలు చేపట్టింది. ప్రధానంగా సోలార్‌ పవర్‌ప్లాంటులో భూములు కోల్పోయిన రైతుల తరపున సిపిఎం రైతులను, ఇతర పార్టీలను కలుపుకుని వరుస కార్యక్రమాలు నిర్వహించి పలువురు రైతులకు నష్టపరిహారం సాధించింది. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌కరత్‌, బివి రాఘవులు శకునాల, గని తదితర గ్రామాల్లో నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు. అప్పటి టిడిపి ప్రభుత్వంపై పోరాడి రైతులకు న్యాయమైన పరిహారం ఇప్పించారు. చెన్నరు, సూరత్‌ హైవే నిర్మాణంలో నిర్వాసితుల తరపున నేటికీ సిపిఎం పోరాడుతోంది. రెండు దశాబ్ధాల పాటు పాణ్యం పారిశ్రామిక వాడలో కార్మికుల పక్షాన అనేక ఉద్యమాలు చేసిన అనుభవం ఉన్న సిపిఎం అభ్యర్థికి పరిస్థితులు అనుకూలంగా కనబడుతున్నాయి. టిడిపి అభ్యర్థి గౌరు చరిత రెడ్డి గతంలో పాణ్యం ఎమ్మెల్యేగా పనిచేశారు. కాటసాని రాంభూపాల్‌ రెడ్డి ఐదుసార్లు కాంగ్రెస్‌ నుంచి, ఒకసారి వైసిపి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇద్దరు ఉద్దండులతో సిపిఎం అభ్యర్థి తలపడుతున్నారు. పదేళ్లల్లో టిడిపి, బిజెపి, వైసిపి పాలకుల వైఫల్యాలు సిపిఎంకు అనుకూలంగా మారనున్నాయి.

➡️