మేనిఫెస్టోలు ఎప్పుడు? – వాయిదాలు వేస్తున్న వైసిపి, టిడిపి

Apr 7,2024 10:56 #manifestos, #TDP, #YCP

– గత ఎన్నికల్లో ఒకేరోజు విడుదల చేసిన ఇరు పార్టీలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టో విడుదలపై ప్రధాన పార్టీలు వాయిదాల పర్వం కొనసాగిస్తున్నాయి. రేపోమాపు అంటున్నాయే తప్ప ఎప్పుడు విడుదల చేస్తాయో చెప్పడం లేదు. ఎవరు ముందు ప్రకటిస్తే వారిని చూసి కాపీ కొట్టే ఆలోచనలో ఇరు పార్టీలు ఉన్నాయా? అనే అనుమానం కలుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలోనూ టిడిపి, వైసిపి ఎన్నికలకు ఐదు రోజులు ముందు ఒకేరోజు మేనిఫెస్టోను ప్రకటించాయి. ఏప్రిల్‌ 6వ తేదీ ఉగాది రోజు ఆయా పార్టీల అధినేతలు చంద్రబాబు, జగన్‌ విడుదల చేశారు. అప్పటి వరకు రూ.2 వేలుగా ఉన్న సామాజిక పింఛన్‌ను రూ.3 వేలకు పెంచుతామని హామీ ఇచ్చాయి. వీటితోపాటు ప్రతియేటా ఉద్యోగాల భర్తీ, రైతులకు వడ్డీ లేని రుణాలు, వ్యవసాయానికి పగటి పూట ఉచిత విద్యుత్‌, ధరల స్థిరీకరణ నిధి వంటి హామీలను రెండు పార్టీలూ ఇచ్చాయి.
ప్రస్తుతం మేనిఫెస్టో అంశంపై ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి ముందుంది. ‘భవిష్యత్‌కు గ్యారెంటీ’ పేరుతో సూపర్‌ సిక్స్‌ పథకాలతో తొలిదశ మేనిఫెస్టోను ఆ పార్టీ విడుదల చేసింది. ‘తల్లికి వందనం’ ప్రస్తుతం అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకానికి, స్రీనిధి పథకం వైఎస్‌ఆర్‌ చేయూతకు కాపీ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు పూర్తిస్థాయి మేనిఫెస్టోను దసరాకు విడుదల చేస్తామని చంద్రబాబు వెల్లడించినప్పటికీ ఆ సమయానికి ‘స్కిల్‌’ కేసులో ఆయన అరెస్టయ్యారు. తర్వాత జనసేనతో కలిసి సంక్రాంతి నాటికి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తాయని ప్రకటించినా విడుదల చేయలేదు. మరలా ఈ రెండు పార్టీలతో బిజెపి జతకలిసింది. మార్చి 17న చిలకలూరిపేటలో జరిగిన టిడిపి – జనసేన – బిజెపి కూటమి సభకు ముఖ్యఅతిథిగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ హాజరయ్యారు. మోడీ రాష్ట్ర విభజన చట్టంలోని కొన్నింటినైనా హామీలుగా ఇస్తారని ఎదురుచూసిన టిడిపి-జనసేనకు నిరాశే మిగిలింది. టిడిపి తొలిదశలో ప్రకటించిన మేనిఫెస్టోకు మూడు పార్టీలు ఏయే అంశాలను జతచేస్తాయో వేచి చూడాల్సి ఉంది.
2019 ఎన్నికలకు సుమారు ఏడాదిన్నర ముందే నవరత్నాలు పేరుతో వైసిపి కొన్ని హామీలను ప్రకటించింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆ పార్టీ మేనిఫెస్టో విడుదలలో వెనుకబడింది. ‘జగన్‌ చెప్పాడంటే చేస్తాడంతే’ నినాదంతో ఆ పార్టీ మేనిఫెస్టోపై కసరత్తు పూర్తిచేసినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. అనంతపురంలో జరిగిన సిద్ధం సభలో ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మేనిఫెస్టో విడుదల చేస్తారని ముందుగా ప్రచారం జరిగినా విడుదల కాలేదు. ప్రకాశం జిల్లా మేదరమెట్ల సభలో విడుదల చేస్తారని మరోసారి చెప్పినా అది వాస్తవ రూపంలో దాల్చలేదు. 2019లో లానే రెండు పార్టీల మేనిఫెస్టోల్లో ఒకేవిధమైన హామీలు ఏమైనా ఉంటాయా? లేదో చూడాల్సి ఉంది.

➡️