అంతర్జాతీయ క్రికెట్‌కు ఎల్గర్‌ గుడ్‌బై

Dec 22,2023 22:05 #Sports

భారత్‌తో టెస్టు సిరీస్‌ చివరిదంటూ ప్రకటన

జహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. భారత్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌ అనంతరం క్రికెట్‌నుంచి పూర్తిగా వైదులుగుతున్నట్లు తెలిపాడు. ‘ఈ గేమ్‌ నుంచి రిటైర్‌ అవుదామనుకుని నిర్ణయించుకున్నా. భారత్‌తో కేప్‌టౌన్‌లో జరుగబోయే రెండో టెస్టే నాకు ఆఖరిది. ఈ గేమ్‌ నాకు చాలా ఇచ్చింది. నేను ఇక్కడే(కేప్‌టౌన్‌లో) నా తొలి టెస్టు సెంచరీ చేశాను. ప్రపంచంలో ఇది నా ఫేవరేట్‌ స్టేడియం ఇదే. ఇక్కడే నా కెరీర్‌లో ఆఖరి టెస్టు ఇక్కడే ఆడబోతున్నాను’ అని తెలిపాడు. 2012లో పెర్త్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు. 2017 నుంచి 2023 వరకూ 17టెస్టులలో దక్షిణాఫ్రికా జట్టుకు సారథిగా వ్యవహరించాడు. 2021లో భారత్‌ పర్యటనకు వెళ్లగా విశాఖ టెస్ట్‌లో అశ్విన్‌, రవీంద్ర జడేజా వంటి అగ్రశ్రేణి స్పిన్నర్లను ఎదుర్కొని 160 పరుగులు చేశాడు. అదే అతడి కెరీర్‌లోనే ది బెస్ట్‌గా నిలిచింది. 84టెస్టులు, 8 వన్డేలు ఆడిన ఎల్గర్‌.. టెస్టుల్లో 149 ఇన్నింగ్స్‌లలో 5,146 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు, 23 అర్థ సెంచరీలూ ఉన్నాయి. టెస్టులలో అతడి సగటు 37.02గా ఉంది. వన్డే ఫార్మాట్‌లో 8మ్యాచ్‌లు ఆడి ఏడు ఇన్నింగ్స్‌లలో 104 పరుగులు మాత్రమే చేశాడు. 2018 తర్వాత వన్డేల్లో చోటు దక్కలేదు. ఈ ఏడాది ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో టెస్టు సిరీస్‌లు కోల్పోయింది. దీంతో దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు టెంబు బవుమా సారథ్య బాధ్యతలు అప్పగించింది.

 

➡️