అంతర్జాతీయ హాకీ పోటీలకు డీప్‌ గ్రేస్‌ ఎక్కా గుడ్‌బై

Jan 28,2024 22:12 #Sports

ముంబయి: భారత మహిళా హాకీ క్రీడాకారిణి, డిఫెండర్‌, పెనాల్టీ కార్నర్‌ స్పెషలిస్ట్‌ డీప్‌ గ్రేస్‌ ఎక్కా అంతర్జాతీయ హాకీకి గుడ్‌బై చెప్పింది. శనివారం సోషల్‌ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించింది. 2011లో 17ఏళ్లకే అంతర్జాతీయ హాకీలో అరంగేట్రం చేసిన గ్రేస్‌ ఎక్కా… రిటైర్మెంట్‌ ప్రకటనలో ఈ 12ఏళ్లలో తనకు సహకరించిన సహచరులు, కోచ్‌లు, మెంటార్‌, సహాయ సిబ్బంది, ప్రత్యేకాధికారులకు కృతజ్ఞతలు తెలియజేసింది. అలాగే భారతజట్టుకు ప్రాతినిధ్యం వహించడం తన జీవితంలో మరచిపోలేని విషయమని పేర్కొంది. భారత్‌ తరఫున రెండుసార్లు ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించిన డ్రీప్‌ గ్రేస్‌.. 2016 రియో ఒలింపిక్స్‌కు భారతజట్టు అర్హత సాధించడంలో 29ఏళ్ల డీప్‌ గ్రేస్‌ ముఖ్యపాత్ర పోషించింది. అలాగే టోక్యో ఒలింపిక్స్‌లోనూ భారత మహిళలజట్టు నాల్గోస్థానంలో నిలవడంలో రక్షణ శ్రేణిలో ఆమె పోషించిన పాత్ర మరువలేనిది. 2022 బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో కాంస్య పతకం, 2016లో ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ, 2017లో ఆసియాకప్‌ టైటిళ్లు గెలిచిన భారతజట్టులో డీప్‌ గ్రేస్‌ ఓ సభ్యురాలు. 2014, 2018 ఆసియా క్రీడల్లోనూ భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించింది.

➡️