ఆదుకున్న స్కీవర్‌, హర్మన్‌

Mar 7,2024 22:24 #Sports

ముంబయి ఇండియన్స్‌ 160/6

న్యూఢిల్లీ: మిడిలార్డర్‌ బ్యాటర్స్‌ స్కీవర్‌ బ్రంట్‌, హర్మన్‌ప్రీత్‌కి తోడు చివర్లో అమెలి కెర్ర్‌ రాణించడంతో ముంబయి ఇండియన్స్‌ గౌరవప్రద స్కోర్‌ చేసింది. యుపి వారియర్స్‌తో గురువారం జరిగిన మహిళల ప్రిమియర్‌ లీగ్‌(డబ్ల్యుపిఎల్‌)లో ముంబయి జట్టు తొలిగా బ్యాటింగ్‌ దిగి నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 160పరుగులు చేసింది. స్కీవర్‌ (45, 31బంతుల్లో, 8ఫోర్లు), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (33, 30బంతుల్లో, 3ఫోర్లు, సిక్సర్‌), అమెలియా కెర్‌ (39, 23బంతుల్లో, 6ఫోర్లు) రాణించారు. ముంబయి నాలుగు ఓవర్లకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. ఇన్నింగ్స్‌ తొలి బంతికే ఫోర్‌ కొట్టిన యస్తికా భాటియా (9)తో పాటు 3 బంతుల్లో 4 పరుగులే చేసిన హేలీ మాథ్యూస్‌ను చమారి ఆటపట్టు పెవిలియన్‌కు పంపింది. 17 రన్స్‌కే రెండు వికెట్లు కోల్పోయిన ముంబైని ఆల్‌రౌండర్‌ నటాలీ సీవర్‌ బ్రంట్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌లు ఆదుకున్నారు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 59 పరుగులు జోడించారు. వేగంగా ఆడిన సీవర్‌.. అర్థసెంచరీకి ఐదు పరుగుల దూరంలో ఉండగా రాజేశ్వరి గైక్వాడ్‌ వేసిన 12వ ఓవర్లో రెండో బంతికి క్లీన్‌ బౌల్డ్‌ అయింది. ఆ తర్వాత వచ్చిన అమెలియా కెర్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 28 రన్స్‌ జోడించిన హర్మన్‌ను సైమా ఠాకూర్‌ బౌల్డ్‌ చేసింది. అమన్‌జ్యోత్‌ కౌర్‌ (7) నిరాశపరచగా సజన (14 బంతుల్లో 22 నాటౌట్‌, 4 ఫోర్లు) ఆఖర్లో దూకుడుగా ఆడింది. యూపి బౌలర్లు చమారి ఆటపట్టు రెండు వికెట్లు తీయగా రాజేశ్వరి గైక్వాడ్‌, దీప్తి శర్మ, సైమా ఠాకూర్‌లు తలా ఓ వికెట్‌ పడగొట్టారు.

స్కోర్‌బోర్డు..

ముంబయి ఇండియన్స్‌ మహిళల ఇన్నింగ్స్‌: యాస్టికా భాటియా (సి)శ్వేత (బి)ఆటపట్టు 9, మాథ్యూస్‌ (సి)ఎక్లేస్టోన్‌ (బి)ఆటపట్టు 4, స్కీవర్‌ బ్రంట్‌ (బి)గైక్వాడ్‌ 45, హర్మన్‌ప్రీత్‌ (బి)సైమా ఠాకూర్‌ 33, అమేలియా కెర్ర్‌ (రనౌట్‌) గ్రేస్‌ హర్రీస్‌/ఎక్లేస్టోన్‌ 39, అమన్‌జ్యోత్‌ (సి)సైమా ఠాకూర్‌ (బి)దీప్తి 7, సజన (నాటౌట్‌) 22, అదనం 1. (20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 160పరుగులు.

వికెట్ల పతనం: 1/8, 2/17, 3/76, 4/104, 5/115, 6/160

బౌలింగ్‌: గ్రేస్‌ హర్రిస్‌ 3-0-18-0, ఆటపట్టు 4-0-27-2, గైక్వాడ్‌ 3-0-34-1, ఎక్లేస్టోన్‌ 4-0-30-0, దీప్తి శర్మ 4-0-31-1, సైమా ఠాకూర్‌ 2-0-19-1.

➡️