భారత్‌-పాక్‌ సిరీస్‌లకు ఆతిథ్యమిస్తాం – క్రికెట్‌ ఆస్ట్రేలియా

Mar 27,2024 22:52 #Sports

సిడ్నీ: భారత్‌-పాక్‌ల మధ్య కొంతకాలంగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ఈ క్రమంలో ఈ రెండు జట్ల మధ్య జరిగే ద్వైపాక్షిక సిరీస్‌ల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని క్రికెట్‌ ఆస్ట్రేలియా(సిఎ) మరోసారి వెల్లడించింది. ఐసిసి వన్డే ప్రపంచకప్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీలు మినహా దాయాది దేశాల మధ్య 2012-13 నుంచి ఇప్పటివరకూ ఎటువంటి మ్యాచ్‌లు జరగలేదు. ఈ తరుణంలో భవిష్యత్తులో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బిసిసిఐ), పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు(పిసిబి)లు అంగీకరిస్తే వాటి నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని సిఎ తెలిపింది. ఆస్ట్రేలియా, టీమిండియాల మధ్య అయిదు టెస్టుల బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌ నవంబరు 22 నుంచి జరిగే షెడ్యూల్‌ను సిఎ ఇప్పటికే ప్రకటించగా.. ఈ సిరీస్‌కుముందు పాక్‌తో ఆసీస్‌ మూడు వన్డేలు, టి20లు ఆడనుంది. ఇరుదేశాలు ఒకే నెలలో తమ దేశంలో పర్యటించనున్న నేపథ్యంలో.. క్రికెట్‌ ఆస్ట్రేలియా ఆపరేషన్స్‌ మేనేజర్‌ పీటర్‌ రోచ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

➡️