హాకీలో శుభారంభం

May 22,2024 23:01 #Sports

షూటౌట్‌లో అర్జెంటీనాపై గెలుపు
బ్యూనస్‌ఎయిర్‌(అర్జెంటీనా): యూరోప్‌ పర్యటనలో భాగంగా జరుగుతున్న ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌-2023-24 సీజన్‌లో భారత్‌ శుభారంభం చేసింది. పురుషుల హాకీజట్టు అర్జెంటీనాపై గెలుపొందగా.. మహిళల జట్టు అర్జెంటీనా చేతిలో పరాజయాన్ని చవిచూసింది. బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో పురుషుల జట్టు షూటౌట్‌లో గెలిచింది. నాలుగు క్వార్టర్లు ముగిసేసరికి భారత్‌-అర్జెంటీనా జట్లు 2-2గోల్స్‌తో సమంగా నిలిచాయి. అనంతరం పెనాల్టీ షూటౌట్‌లో భారత్‌ 5-4గోల్స్‌ తేడాతో అర్జెంటీనాను ఓడించింది. భారతజట్టు గెలుపులో గోల్‌కీపర్‌ శ్రీజేష్‌ కీలకపాత్ర పోషించాడు. తొలి మూడు పెనాల్టీ షూటౌట్‌లను ఇరుజట్లు గోల్స్‌ చేయడంతో సడెన్‌ డెత్‌లో భారత్‌ గెలిచింది. హర్మన్‌ప్రీత్‌, శ్రీజేశ్‌, సుఖ్‌జీత్‌ గోల్స్‌ చేయగా.. లలిత్‌ గోల్‌ చేయడంలో విఫలమయ్యాడు. శ్రీజేశ్‌ ఒక గోల్‌ను అడ్డుకోవడంతో 3గోల్స్‌ పూర్తయ్యేసరికి ఇరుజట్లు 2-2తో సమంగా నిలిచాయి. ఆ తర్వాత సడెన్‌ డెత్‌లకు దారితీసింది. ఈ పర్యటనలో భాగంగా 26న బెల్జియంతో తలపడనుంది.
నిరాశపరిచిన మహిళలు..
ఇక భారత మహిళలజట్టు అర్జెంటీనా చేతిలో చిత్తుగా ఓడింది. ఈ పర్యటనలో భాగంగా బుధవారం అర్జెంటీనాతో తలపడిన భారత మహిళల హాకీ జట్టు 0-5గోల్స్‌ తేడాతో పరాజయాన్ని చవిచూసింది. అర్జెంటీనా తరఫున జులీటా(53, 59వ ని.), అగస్టినా(13వ ని.), వలెంటినా(24వ ని.), విక్టోరియా(41వ ని.) ఒక్కో గోల్‌ కొట్టారు. భారత మహిళలజట్టు నూతన కోచ్‌ హరేంద్ర సింగ్‌ నేతృత్వంలో తొలిసారి యూరప్‌ పర్యటనకు వచ్చింది.

➡️