రస్సెల్‌పైనే అందరి చూపు..

Mar 28,2024 22:21 #Sports

రేపు బెంగళూరుాకోల్‌కతా మ్యాచ్‌
బెంగళూరు: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్టార్‌ బ్యాటర్‌ ఆండీ రస్సెల్‌పైనే అందరి కళ్లూ ఉన్నాయని ఆ ఫ్రాంచైజీ ప్రధాన కోచ్‌ చంద్రకాంత్‌ పండిట్‌ తెలిపారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో జమైకాకు చెందిన రస్సెల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. కేవలం 25బంతుల్లో 3ఫోర్లు, 7భారీ సిక్సర్లతో 64పరుగులు చేశాడు. దీంతో చాలాకాలం తర్వాత రస్సెల్‌ పూర్వ ఫామ్‌తో అభిమానులకు కనువిందు చేశాడు. ఒకే ఓవర్‌లో మూడు భారీ సిక్స్‌లతో చెలరేగిపోయాడు. మయాంక్‌ మర్కండే వేసిన 16 ఓవర్‌లో తొలి బంతికి డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా 91 మీటర్ల సిక్స్‌, నాలుగో బంతికి 102 మీటర్ల సిక్స్‌, ఐదో బంతిని లాంగాన్‌ మీదుగా (96 మీటర్లు) స్టాండ్స్‌లోకి పంపాడు. టాప్‌, మిడిలార్డర్‌లో కంటే లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కే ప్రాధాన్యతనిస్తానని రస్సెల్‌ కూడా అంగీకరించాడు. మరోవైపు బెంగళూరు జట్టు ఆడిన 2 మ్యాచుల్లో ఒక మ్యాచ్‌లో నెగ్గి, మరో మ్యాచ్‌లో ఓటమిపాలైంది. దీంతో ఈ మ్యాచ్‌ ఇరుజట్లకు కీలకం కానుంది.

➡️