చెన్నై నిలిచింది!

May 13,2024 06:52 #Sports

రాజస్థాన్‌పై సూపర్‌కింగ్స్‌ గెలుపు
3 వికెట్లతో విజృంభించిన సిమ్రన్‌జిత్‌ సింగ్‌
ఛేదనలో రాణించిన రుతురాజ్‌ గైక్వాడ్‌
రాజస్థాన్‌ 141/5, చెన్నై 145/5
చెన్నై సూపర్‌కింగ్స్‌ నిలిచింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌) 17వ సీజన్‌ ప్లే ఆఫ్స్‌ రేసులో ఆశలు సజీవంగా నిలుపుకుంది. చెపాక్‌లో ఆదివారం జరిగిన కీలక మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై చెన్నై సూపర్‌కింగ్స్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సీమర్‌ సిమ్రన్‌జిత్‌ సింగ్‌ (3/26) విజృంభించటంతో తొలుత రాజస్థాన్‌ రాయల్స్‌ 141/5 పరుగులు చేసింది. ఛేదనలో కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (42 నాటౌట్‌) రాణించటంతో మరో పది బంతులు ఉండగానే సూపర్‌కింగ్స్‌ లాంఛనం ముగించింది.
చెన్నై : చెన్నై సూపర్‌కింగ్స్‌ ఊపిరి పీల్చుకుంది. ఐపీఎల్‌ 17 ప్లే ఆఫ్స్‌ దశ పోటీ తారాస్థాయికి చేరుకున్న తరుణంలో అగ్రజట్టు రాజస్థాన్‌ రాయల్స్‌పై చెన్నై సూపర్‌కింగ్స్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 142 పరుగుల ఛేదనలో కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (42 నాటౌట్‌, 41 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) అజేయ ఇన్నింగ్స్‌తో రాణించగా.. శివం దూబె (18, 11 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), రచిన్‌ రవీంద్ర (27, 18 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) , డార్లీ మిచెల్‌ (22, 13 బంతుల్లో 4 ఫోర్లు) సమిష్టిగా రాణించారు. దీంతో 18.2 ఓవర్లలోనే చెన్నై సూపర్‌కింగ్స్‌ 5 వికెట్లకు 145 పరుగులు చేసింది. అంతకుముందు, తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 141 పరుగులు చేసింది. పరుగుల సాధన గగనమైన పిచ్‌పై రియాన్‌ పరాగ్‌ (47 నాటౌట్‌, 35 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు) రాయల్స్‌ను ఆదుకున్నాడు. ధ్రువ్‌ జురెల్‌ (28, 18 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్‌ (24, 21 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. సూపర్‌కింగ్స్‌ యువ పేసర్‌ సిమ్రన్‌జిత్‌ సింగ్‌ (3/26) మూడు వికెట్ల ప్రదర్శనతో రాయల్స్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఇది సీజన్లో 13 మ్యాచుల్లో ఏడో విజయం కాగా.. రాజస్థాన్‌ రాయల్స్‌కు 12 మ్యాచుల్లో నాల్గో పరాజయం కావటం గమనార్హం. చెన్నై సూపర్‌కింగ్స్‌ పేసర్‌ సిమ్రన్‌జిత్‌ సింగ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు.
రుతురాజ్‌ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ : సూపర్‌కింగ్స్‌ లక్ష్యం 142 పరుగులు. చెపాక్‌ పిచ్‌పై ఇది భారీ టార్గెట్‌. ఓపెనర్లు రచిన్‌ రవీంద్ర (27), రుతురాజ్‌ గైక్వాడ్‌ (42 నాటౌట్‌) ఛేదనను కాస్త సులభతరం చేశారు. రచిన్‌ రవీంద్ర పవర్‌ప్లేలో ఎదురుదాడి చేశాడు. రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో మెరిశాడు. అశ్విన్‌ ఓవర్లో రచిన్‌ అవుటైనా.. డార్లీ మిచెల్‌ (22) దంచికొట్టాడు. నాలుగు బౌండరీలతో దండయాత్ర చేశాడు. దీంతో పవర్‌ప్లేలో 56 పరుగులు సాధించిన సూపర్‌కింగ్స్‌ విజయానికి గట్టి పునాది వేసుకుంది. ఓ ఎండ్‌లో సమయోచిత ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన రుతురాజ్‌ గైక్వాడ్‌ ఆఖరు వరకు క్రీజులో అజేయంగా నిలిచాడు. మోయిన్‌ అలీ (10), రవీంద్ర జడేజా (5) నిరాశపరిచినా.. శివం దూబె (18), సమీర్‌ రిజ్వీ (15 నాటౌట్‌, 8 బంతుల్లో 3 ఫోర్లు) విజయంలో కీలక పాత్ర పోషించారు. రాయల్స్‌ బౌలర్లలో స్పిన్నర్‌ అశ్విన్‌ (2/35), చాహల్‌ (1/22) రాణించినా.. 18.2 ఓవర్లలోనే సూపర్‌కింగ్స్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. సీజన్లో ఏడో విజయంతో ప్లే ఆఫ్స్‌ రేసులో నిలిచింది.
సిమ్రన్‌జిత్‌ సూపర్‌ : రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాటర్లను సూపర్‌కింగ్స్‌ పేసర్లు సిమ్రన్‌జిత్‌ సింగ్‌ (3/26), తుషార్‌ దేశ్‌పాండే (2/30) నిప్పులు చెరిగే స్పెల్స్‌తో కట్టడి చేశారు. విధ్వంసక ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (24), జోశ్‌ బట్లర్‌ (21) క్రీజులో నిలిచినా.. పవర్‌ప్లేలో రాజస్థాన్‌ 42 పరుగులే చేసింది. సిమ్రన్‌జిత్‌ వరుస ఓవర్లలో యశస్వి జైస్వాల్‌, జోశ్‌ బట్లర్‌ను సాగనంపాడు. కెప్టెన్‌ సంజు శాంసన్‌ (15) సైతం సిమ్రన్‌జిత్‌కు వికెట్‌ కోల్పోయాడు. రియాన్‌ పరాగ్‌ (47 నాటౌట్‌) క్లిష్ట తరుణంలో క్రీజులో నిలిచాడు. ధ్రువ్‌ జురెల్‌ (28)తో కలిసి ఇన్నింగ్స్‌కు ముందుకు నడిపించాడు. జురెల్‌ నిష్క్రమణ, శుభమ్‌ దూబె (0) నిరాశరపర్చటంతో రాజస్థాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 141 పరుగులు చేసింది.

➡️