కోల్‌కతాకు చెన్నై కళ్లెం

Apr 8,2024 23:52 #2024 ipl, #Cricket, #csk, #Sports
  • జడేజా, దేశ్‌పాండే మాయ
  • నైట్‌రైడర్స్‌పై ఏడువికెట్ల తేడాతో సూపర్‌కింగ్స్‌ గెలుపు

చెన్నై: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జైత్రయాత్రకు చెన్నై సూపర్‌కింగ్‌ కళ్లెం వేసింది. ఎంఎ చిదంబరం(చెపాక్‌) స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు ఏడు వికెట్ల తేడాతో కోల్‌కతాను చిత్తుచేసింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాను జడేజా, దేశ్‌పాండే కట్టడి చేయడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9వికెట్లు నష్టపోయి 137పరుగులు చేసింది. అనంతరం ఆ లక్ష్యాన్ని చెన్నై జట్టు 17.4ఓవర్లలో కేవలం 3వికెట్లు కోల్పోయి 141పరుగులు చేసి విజయం సాధించింది. బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడే కోల్‌కతా నైట్‌రైడర్స్‌లను జడేజా, దేశ్‌పాండే కట్టడి చేశారు. టాపార్డర్‌ బ్యాటర్లను జడేజా, లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లను దేశ్‌పాండే పెవీలియన్‌లకు పంపారు. ఆ తర్వాత బ్యాటుతో దంచేసిన డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓటమన్నదే ఎరుగని కోల్‌కతాను చిత్తుగా ఓడించింది. తమ కంచుకోటలో కోల్‌కతాకు ముచ్చెమటలు పట్టించిన సీఎస్కే 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(67 నాటౌట్‌) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడగా.. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ శివం దూబే(28) ఎప్పటిలానే సిక్సర్లతో హోరెత్తించాడు. దీంతో, చెన్నై మూడో విజయం ఖాతాలో వేసుకుంది. స్వల్ప ఛేదనలో డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నైకి షాక్‌. 27 పరుగుల వద్ద తొలి వికెట్‌ పడింది. వరల్డ్‌ కప్‌లో దంచికొట్టిన ఓపెనర్‌ రచిన్‌ రవీంద్ర(15) మరోసారి నిరాశపరిచాడు. వైభవ్‌ అరోరా బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడి చక్రవర్తికి క్యాచ్‌ ఇచ్చాడు. రచిన్‌ వికెట్‌ పడినా డారిల్‌ మిచెల్‌(3) జతగా గైక్వాడ్‌ ధాటిగా ఆడాడు. ఈ జోడీని విడదీసేందుకు అయ్యర్‌ బౌలర్లను మార్చినా ఫలితం లేకపోయింది. ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ (0) ఇన్నింగ్స్‌ తొలి బంతికే అవుట్‌ కాగా, సునీల్‌ నరైన్‌ 27, రఘువంశీ 24, కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ 34 పరుగులతో ఓ మోస్తరుగా రాణించారు. శ్రేయాస్‌ అయ్యర్‌ షార్ట్‌ పిచ్‌ బంతులు ఆడడంలో తన బలహీనతను ఈ మ్యాచ్‌ ద్వారా మరోసారి బయటపెట్టుకున్నాడు. అయ్యర్‌ వీక్‌ నెస్‌ తెలిసిన చెన్నై బౌలర్లు పదే పదే స్లో షార్ట్‌ బాల్స్‌ విసరగా, ఆ బంతులను ఆడేందుకు అయ్యర్‌ ఆపసోపాలు పడ్డాడు. చివరికి ఓ షార్ట్‌ బాల్‌ కే బలయ్యాడు. క్రీజులో ఉన్నంతసేపూ అసౌకర్యంగా కనిపించిన వెంకటేశ్‌ అయ్యర్‌ (3), రింకూ సింగ్‌ (9) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ బౌలర్లలో తుషార్‌ దేశ్‌ పాండే 3, రవీంద్ర జడేజా 3, ముస్తాఫిజూర్‌ రెహ్మాన్‌ 2, మహీశ్‌ తీక్షణ 1 వికెట్‌ పడగొట్టారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ రవీంద్ర జడేజాకు లభించింది.

స్కోర్‌బోర్డు…
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి)జడేజా (బి)తుషార్‌ దేశ్‌పాండే 0, నరైన్‌ (సి)తీక్షణ (బి)జడేజా 27, రఘువంశీ (ఎల్‌బి)జడేజా 24, శ్రేయస్‌ (సి)జడేజా (బి)ముస్తాఫిజుర్‌ 34, వెంకటేశ్‌ అయ్యర్‌ (సి)మిఛెల్‌ (బి)జడేజా 3, రమణ్‌దీప్‌ సింగ్‌ (బి)తీక్షణ 13, రింకు సింగ్‌ (బి)దేశ్‌పాండే 9, రస్సెల్‌ (సి)మిచెల్‌ (బి)దేశ్‌పాండే 10, అనుకుల్‌ రారు (నాటౌట్‌) 3, సాల్ట్‌ (సి)రచిన్‌ రవీంద్ర (బి)ముస్తాఫిజుర్‌ 0, వైభవ్‌ అరోరా (నాటౌట్‌) 1, అదనం 13. (20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి) 137పరుగులు.
వికెట్ల పతనం: 1/0, 2/56, 3/60, 4/64, 5/65, 6/112, 7/127, 8/135, 8/135
బౌలింగ్‌: దేశ్‌పాండే 4-0-33-3, ముస్తాఫిజుర్‌ 4-0-22-2, శార్దూల్‌ 3-0-27-0, తీక్షణ 4-0-28-1, జడేజా 4-0-18-3, రచిన్‌ రవీంద్ర 1-0-4-0

చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రచిన్‌ రవీంద్ర (సి)చక్రవర్తి (బి)వైభవ్‌ అరోరా 15, గైక్వాడ్‌ (నాటౌట్‌) 67, మిఛెల్‌ (బి)నరైన్‌ 25, దూబే (బి)వైభవ్‌ అరోరా 28, ధోనీ (నాటౌట్‌) 1, అదనం 5. (17.4ఓవర్లలో 3వికెట్ల నష్టానికి) 141పరుగులు.
వికెట్ల పతనం: 1/27, 2/97, 3/135

బౌలింగ్‌: స్టార్క్‌ 3-0-29-0, వైభవ్‌ అరోరా 4-0-28-2, అనుకుల్‌ రారు 1.4-0-18-0, సునీల్‌ నరైన్‌ 4-0-30-1, వరణ్‌ చక్రవర్తి 4-0-26-0, ఆండీ రస్సెల్‌ 1-0-8-0

➡️