T20 World Cup: టీమిండియాకు అభినందనలు వెల్లువ

Jun 30,2024 07:49 #PM Modi, #T20 world cup, #Team India

17 ఏళ్ల సుధీర్ఘ విరామం తరువాత ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో భారత్‌, సౌతాఫ్రికాను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. భారత్‌ విజయం సాధించడం పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ప్రపంచ అత్యుత్తమ టోర్నీలో భారత్‌ విజేతగా అవతరించడం చారిత్రాత్మకం అని అన్నారు. జట్టు సమష్టి ఆడి విజయం సాధించడం పట్ల దేశ ప్రజలందరి తరఫున శుభాభినందనలు తెలుపుతున్నానని వెల్లడించారు. భారత ఆటగాళ్ల అద్భుత ప్రదర్శన చూసి దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు గర్విస్తున్నారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. భారత క్రికెట్‌ జట్టు సరికొత్త చరిత్రను తిరగరాసిందని., 17 ఏళ్ల తర్వాత ప్రతిష్టాత్మకమైన టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకోవాలనే కలను రోహిత్‌ సేన సాకారం చేసింది. భారత క్రికెట్‌ జట్టుకు, సహాయక సిబ్బందికి నా హదయపూర్వక అభినందనలని., దేశాన్ని ఆనంద వేడుకల్లో ముంచెత్తినందుకు అందరికీ కతజ్ఞతలు తెలిపారు

ఆధ్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఒత్తిడిని జయంచి సగర్వంగా ప్రపంచకప్‌ సాధించి పెట్టిన భారత క్రికెటర్లకు పేరు పేరునా హృదయ పూర్వక శుభాకాంక్షలు అంటూ ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. మీ విజయం భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి దాయకమని., ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ క్రికెట్‌లో భారత్‌ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తునట్లు ఆయన తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ విశ్వ విజేతగా నిలచిన భారత జట్టుకు అభినందనలు తెలిపారు. భారత్‌ జట్టు టీ20 ప్రపంచ కప్‌ గెలిచిన తీరు అద్భుతమైంది. రోహిత్‌ సేన 13ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని గెలుచుకుని చరిత్ర సష్టించింది. సూర్య కుమార్‌ యాదవ్‌ చివరి ఓవర్‌లో తీవ్రమైన ఒత్తిడిలోనూ అద్భుతమైన క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. టీమిండియాను చూసి దేశం గర్విస్తోంది అంటూ ఆయన టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు.

వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌ అభినందనలు

టీ20 వరల్డ్‌ కప్‌ గెలుచుకున్న భారత క్రికెట్‌ జట్టుకు మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. కృషి, పట్టుదలతో మరో గొప్ప గెలుపు సొంతం చేసుకుందని ప్రశంసించారు. టోర్నీ ఆద్యంతం సమష్టి కృషితో భారత జట్టు విజయాలు సాధించిందన్నారు.  వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో ఓటమితో తీవ్ర నిరాశకు గురైన అభిమానులకు ఈ విజయం గొప్ప ఊరట­నిస్తుందని అభిప్రాయపడ్డారు.

➡️