ఇంగ్లండ్‌ స్పిన్‌ దిగ్గజం కన్నుమూత

Apr 16,2024 11:12 #England spin giant, #passed away

ఇంగ్లండ్‌ : ఇంగ్లండ్‌ స్పిన్‌ దిగ్గజం డెరిక్‌ అండర్‌వుడ్‌ (78) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల కారణంగా డెరిక్‌ తుదిశ్వాస విడిచారని తెలుస్తుంది. 1966-82 మధ్య ఇంగ్లండ్‌ తరఫున 86 టెస్ట్‌ల్లో 297 వికెట్లు పడగొట్టిన డెరిక్‌.. ఆ జట్టు తరఫున నేటికి అత్యధిక వికెట్లు పడగొట్టిన స్పిన్‌ బౌలర్‌గా పేరుగాంచారు. అలాగే డెరిక్‌ ఇంగ్లండ్‌ తరఫున ఆరో అత్యధిక వికెట్‌ టేకర్‌గానూ కొనసాగుతున్నారు.

కౌంటీల్లో కెంట్‌కు సుదీర్ఘకాలం పాటు (1963-87) ప్రాతనిథ్యం వహించిన డెరిక్‌.. ఆ జట్టు తరఫున 900కు పైగా మ్యాచ్‌లు ఆడి 2523 వికెట్లు పడగొట్టారు. 17 ఏళ్ల వయసులోనే కెంట్‌కు ఆడటం మొదలుపెట్టిన డెరిక్‌.. 25 ఏళ్ల వయసులోపే 1000 ఫస్ట్‌ క్లాస్‌ వికెట్లు పడగొట్టి రికార్డుల్లోకెక్కారు. డెరిక్‌ కెంట్‌ తరఫున ఓ సీజన్‌లో 100కు పైగా వికెట్ల ఘనతను 10 సార్లు సాధించారు. 1966 సీజన్‌లో డెరిక్‌ ఏకంగా 157 వికెట్లు పడగొట్టారు. డెరిక్‌ 1966, 1967, 1978, 1979 సంవత్సరాల్లో ఇంగ్లండ్‌ లీడింగ్‌ బౌలర్‌గా కొనసాగారు. డెరిక్‌ 1969 సెప్టెంబర్‌ నుంచి 1973 ఆగస్ట్‌ వరకు ఐసీసీ టెస్ట్‌ బౌలర్స్‌ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌గా రాణించారు.

ఇంగ్లండ్‌ జాతీయ జట్టుకు వన్డేల్లో సైతం ప్రాతినిథ్యం వహించిన డెరిక్‌.. ఈ ఫార్మాట్‌లో 26 మ్యాచ్‌లు ఆడి 32 వికెట్లు పడగొట్టారు. డెరిక్‌ 1975 వన్డే వరల్డ్‌కప్‌లోనూ ఇంగ్లండ్‌కు ఆడారు. వికెట్లు పడగొట్టడమే కాకుండా ఎన్నో అవార్డులు అందుకున్న డెరిక్‌.. 2009లో ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమర్‌గా ఎంపికయ్యారు. డెరిక్‌ 2006లో కెంట్‌ క్రికెట్‌ క్లబ్‌ అధ్యక్షుడిగా.. 2008లో ఎంసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. డెరిక్‌ మరణం కెంట్‌ క్రికెట్‌ కుటుంబానికి తీరని లోటు అని క్లబ్‌ ప్రస్తుత అధ్యక్షుడు సైమన్‌ ఫిలిప్‌ సంతాప ప్రకటన విడుదల చేశారు.

➡️