Gymnastics : దీప పసిడి వెలుగు

తాష్కెంట్‌ : భారత స్టార్‌ జిమ్నాస్ట్‌ దీప కర్మాకర్‌ నవ చరిత్ర సృష్టించింది. 21 నెలల నిషేధం ముగించుకుని 30 ఏండ్ల వయసులో మళ్లీ వాల్ట్‌ విన్యాసం మొదలుపెట్టిన దీప కర్మాకర్‌ ఆసియా జిమ్నాస్టిక్స్‌ చాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకం సాధించింది. ఆసియా చాంపియన్‌షిప్స్‌లో భారత్‌ నుంచి ఎవరూ స్వర్ణం సాధించలేదు. దీప కర్మాకర్‌ ఈ ఘనత సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా నిలిచింది. 2015 ఆసియా చాంపియన్‌షిప్స్‌లో కాంస్యం సాధించిన దీప కర్మాకర్‌.. ఈ సారి పతకం రంగు పసిడికి మార్చుకుంది. మెడల్‌ రేసులో ఎనిమిది మంది జిమ్నాస్ట్‌లు పోటీపడగా.. దీప కర్మాకర్‌ రెండు వాల్ట్‌ విన్యాసాల్లో సగటు 13.566 పాయింట్లు సాధించింది. నార్త్‌ కోరియాకు చెందిన జిమ్నాస్ట్‌లు కిమ్‌ సన్‌ (13.466), జో (12.966) వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించారు. 2016 రియో ఒలింపిక్స్‌ వాల్ట్‌ ఫైనల్లో నాల్గో స్థానంలో నిలిచి తృటిలో పతకం చేజార్చుకున్న దీప కర్మాకర్‌.. 2014 గ్లాస్గో కామన్‌వెల్త్‌ క్రీడల్లో కాంస్య పతకం సాధించింది. గత ఆసియా చాంపియన్‌షిప్స్‌లో భారత జిమ్నాస్ట్‌లు అశీష్‌ కుమార్‌ (2006), దీప కర్మాకర్‌ (2015), ప్రణతి నాయక్‌ (2019, 2022) కాంస్య పతకాలు సాధించారు.

➡️