అక్షర్‌ అదుర్స్‌

Jan 15,2024 15:32 #Cricket, #Sports
  • దూబే, జైస్వాల్‌ అర్ధసెంచరీలు
  • రెండో టి20లో ఆఫ్ఘన్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలుపు
  • సిరీస్‌ 2-0తో భారత్‌ కైవసం

ఇండోర్‌: తొలి టి20లో మెరిసిన శివమ్‌ దూబే.. రెండో టీ20లోనూ బ్యాట్‌ ఝుళిపించాడు. కేవలం 32బంతుల్లో 5ఫోర్లు, 4సిక్సర్ల సాయంతో అజేయంగా 63పరుగులు చేసి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. మరోవైపు యువ క్రికెటర్‌ యశస్వి జైస్వాల్‌(68; 34బంతుల్లో 5ఫోర్లు, 6సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. దీంతో ఆఫ్ఘన్‌ నిర్దేశించిన 173పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 15.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలి టీ20లో సత్తా చాటిన శివమ్‌ దూబే నేటి మ్యాచ్‌లోనూ విధ్వంసం సృష్టించాడు. టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (0) ఆడిన తొలి బంతికే డకౌట్‌ అయ్యాడు. ఇక విరాట్‌ కోహ్లీ 16 బంతుల్లో 5ఫోర్లతో చకచకా 29 పరుగులు చేశాడు. చివర్లో రింకూ సింగ్‌ 9 బంతుల్లో 9 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు. ఆఫ్ఘన్‌ బౌలర్లలో కరీం జనత్‌కు రెండు, నవీనుల్‌ హక్‌, ఫజల్‌ హక్‌ ఫరూఖీకి ఒక్కో వికెట్‌ దక్కాయి.టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్‌ బ్యాటర్‌ గుల్బదిన్‌ నాయబ్‌ (57; 35బంతుల్లో 5ఫోర్లు, 4సిక్సర్లు)కి తోడు నజీబుల్లా జడ్రాన్‌(23), కరీమ్‌ జనత్‌(20), ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌(21) బ్యాటింగ్‌లో రాణించారు. భారత బౌలర్లు లెఫ్టార్మ్‌ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ విసిరిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో ఆఫ్ఘన్‌ జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. ఆ ఓవర్లో నూర్‌ అహ్మద్‌ (1) కోహ్లీకి క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ కాగా, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌, ఫజల్‌ హక్‌ ఫరూఖీ(0) రనౌటయ్యారు. టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌కు మూడు, రవి బిష్ణోరు, అక్షర్‌ పటేల్‌కు రెండేసి, శివం దూబేకు ఒక వికెట్‌ దక్కాయి. ఈ గెలుపుతో మూడు టి20ల సిరీస్‌ను టీమిండియా మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకోగా.. మూడో, చివరి టి20 17న బెంగళూరు వేదికగా జరగనుంది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అక్షర్‌ పటేల్‌కు లభించింది.

రోహిత్‌ శర్మ ఖాతాలో మరో ఘనత

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఖాతాలో మరో ఘనత చేరింది. ఆఫ్ఘనిస్థాన్‌తో రెండో టి20 మ్యాచ్‌ రోహిత్‌ కెరీర్‌లో 150వ అంతర్జాతీయ టి20 మ్యాచ్‌. పురుషుల అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో 150మ్యాచ్‌ మైలురాయిని చేరుకున్న మొట్టమొదటి క్రికెటర్‌ రోహిత్‌ శర్మే.

స్కోర్‌బోర్డు..

ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (సి)దూబే (బి)బిష్ణోరు 14, జడ్రాన్‌ (బి)అక్షర్‌ 8, గులాబుద్దిన్‌ (సి)రోహిత్‌ (బి)అక్షర్‌ 57, అజ్మతుల్లా (బి)దూబే 2, మహ్మద్‌ నబి (సి)రింకు (బి)బిష్ణోరు 14, జడ్రాన్‌ (సి)ఆర్ష్‌దీప్‌ 23, కరీమ్‌ జన్నత్‌ (సి)అక్షర్‌ (బి)ఆర్ష్‌దీప్‌ 20, ముజీబ్‌ (రనౌట్‌) జితేశ్‌ /ఆర్ష్‌దీప్‌ 21, నూర్‌ అహ్మద్‌ (సి)కోహ్లి (బి)ఆర్ష్‌దీప్‌ 1, నబీన్‌ (నాటౌట్‌) 1, ఫారూఖీ (రనౌట్‌)జైస్వాల్‌ 0, అదనం 11. (20 ఓవర్లలో ఆలౌట్‌) 172పరుగులు.

వికెట్ల పతనం: 1/20, 2/53, 3/60, 4/61, 5/104, 6/134, 7/164, 8/170, 9/171, 10/172

బౌలింగ్‌: ఆర్ష్‌దీప్‌ 4-0-32-3, ముఖేష్‌ కుమార్‌ 2-0-21-0, రవి బిష్ణోరు 4-0-39-2, అక్షర్‌ 4-0-17-2, దూబే 3-0-36-1, సుందర్‌ 3-0-23-0

ఇండియా ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి)గుర్బాజ్‌ (బి)కరీమ్‌ 68, రోహిత్‌ శర్మ (సి)ఫారూఖీ 0, కోహ్లి (సి)ఇబ్రహీం (బి)నవీన్‌ 29, దూబే (నాటౌట్‌) 63, జితేశ్‌ శర్మ (సి)నబి (బి)కరీమ్‌ 0, రింకు సింగ్‌ (నాటౌట్‌) 9, అదనం 4. (15.4ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 173పరుగులు.

వికెట్ల పతనం: 1/5, 2/62, 3/154, 4/156

బౌలింగ్‌: ఫారూఖీ 3.4-0-28-1, ముజీబ్‌ 2-0-32-0, నవీన్‌ 3-0-33-1, నూర్‌ అహ్మద్‌ 3-0-35-0, నబీ 2-0-30-0, కరీమ్‌ 2-0-13-2.

➡️