ప్లే-ఆఫ్స్‌కు కోల్‌కతా

May 12,2024 08:39
  • ముంబయిపై 18పరుగుల తేడాతో గెలుపు

కోల్‌కతా : ప్లే ఆఫ్స్‌ బెర్తును ఖాయం చేసుకోవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు 18పరుగుల తేడాతో గెలిచింది. వర్షం కారణంగా ఓవర్లు కుదించిన ఈ మ్యాచ్‌ తొలిగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 16 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 157పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబయి ఓపెనర్లు దాటిగా ఆడినా.. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్స్‌ నిరాశపరిచారు. దీంతో 16ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబయి జట్టు 8వికెట్లు కోల్పోయి 139పరుగులే చేసింది. ఈ గెలుపుతో కోల్‌కతా 18పాయింట్లతో ప్లే-ఆఫ్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా కష్టాలతోనే ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. తొలి ఓవర్లోనే ఫిలిప్‌ సాల్ట్‌(6)ను తుషార వెనక్కి పంపాడు. మరో ఓపెనర్‌ సునీల్‌ నరైన్‌(0)ను బుమ్రా బౌల్డ్‌ చేశాడు. దీంతో కోల్‌కతా 10 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఆ దశలో క్రీజులోకి వచ్చిన వెంకటేశ్‌ అయ్యర్‌(42) కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(7)తో కీలక పరుగులు చేశాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 30పరుగులు జోడించారు. ఆ తర్వాత నితీశ్‌ రానా(33), ఆండ్రూ రస్సెల్‌(24) వేగంగా ఆడి ఐదో వికెట్‌కు 39పరుగులు రాబట్టారు. ఆఖర్లో రింకూ సింగ్‌(20) మెరుపులు మెరిపించాడు. ముంబయి బౌలర్లలో జస్ప్రీత్‌ బుమ్రా, పీయూష్‌ చావ్లాకు రెండేసి, తుషారా, కంబోజ్‌లకు ఒక్కో వికెట్‌ దక్కాయి.
ఛేదనలో ముంబయి ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌(40), రోహిత్‌ శర్మ(19) తొలి వికెట్‌కు 6.5ఓవర్లలో 65పరుగులు జతచేసి గట్టి పునాది వేశారు. ఆ తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌(11) నిరాశపరిచినా.. తిలక్‌ వర్మ(32) రాణించాడు. ఆ తర్వాత లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లంతా ఇలా వచ్చి అలా వెళ్లారు. దీంతో ముంబయి జట్టు ఛేదనలో వెనుకబడి ఓటమిపాలైంది. కోల్‌కతా బౌలర్లు హర్షీత్‌ రాణా, చక్రవర్తి, రస్సెల్‌కు రెండేసి, నరైన్‌కు ఒక వికెట్‌ దక్కాయి.
స్కోర్‌బోర్డు…
కోల్‌కతా ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి)కంబోజ్‌ (బి)తుషారా 6, నరైన్‌ (బి)బుమ్రా 0, వెంకటేశ్‌ అయ్యర్‌ (సి)సూర్యకుమార్‌ (బి)చావ్లా 42, శ్రేయస్‌ అయ్యర్‌ (బి)కంబోజ్‌ 7, నితీశ్‌ రాణా (రనౌట్‌) తిలక్‌ వర్మ 33, రస్సెల్‌ (సి)కంబోజ్‌ (బి)చావ్లా 24, రింకు సింగ్‌ (సి)ఇషాన్‌ కిషన్‌ (బి)బుమ్రా 20, రమన్‌దీప్‌ సింగ్‌ (నాటౌట్‌) 17, స్టార్క్‌ (నాటౌట్‌) 2, అదనం 6. (16ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 157పరుగులు. బౌలింగ్‌: తుషారా 3-0-31-1, బుమ్రా 4-0-39-2, కంబోజ్‌ 3-0-24-1, హార్దిక్‌ 3-0-32-0, చావ్లా 3-0-26-2.
ముంబయి ఇన్నింగ్స్‌: ఇషాన్‌ కిషన్‌ (సి)రింకు సింగ్‌ (బి)నరైన్‌ 40, రోహిత్‌ శర్మ (సి)నరైన్‌ (బి)చక్రవర్తి 19, సూర్యకుమార్‌ (సి)రమన్‌దీప్‌ సింగ్‌ (బి)రస్సెల్‌ 11, తిలక్‌ వర్మ (సి)సాల్ట్‌ (బి)హర్షీత్‌ రాణా 32, హార్దిక్‌ పాండ్యా (సి)వైభవ్‌ అరోరా (బి)వరణ్‌ చక్రవర్తి 2, టిమ్‌ డేవిడ్‌ (సి)శ్రేయస్‌ అయ్యర్‌ (బి)రస్సెల్‌ 0, వధేరా (రనౌట్‌)స్టార్క్‌/సాల్ట్‌ 3, నమన్‌ ధీర్‌ (సి)రింకు సింగ్‌ (బి)హర్షీత్‌ రాణా 17, కంబోజ్‌ (నాటౌట్‌) 2, చావ్లా (నాటౌట్‌) 1, అదనం 12. బౌలింగ్‌: వైభవ్‌ అరోరా 2-0-16-0, స్టార్క్‌ 1-0-11-0, హర్షీత్‌ 3-0-34-2, నరైన్‌ 3-0-21-1, వరణ్‌ చక్రవర్తి 4-0-17-2, రస్సెల్‌ 3-0-34-2,

 

➡️