నేటి నుంచి మళ్లీ ఎండలు

May 26,2024 23:45

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : తుపాను ప్రభావం ఉమ్మడి గుంటూరు జిల్లాపై ఏమాత్రం చూపలేదు. అంతేగాక ఈ తుపాను తరువాత ఎండలు మళ్లీ పెరుగుతాయని వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ చెప్పినట్టే ఆదివారం నుంచి ఎండల తీవ్రత పెరిగింది. ఎండ ఎక్కువగా లేనట్టు కన్పించినా వేడిగాలి ప్రారంభం అయింది. ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. మహిళలు, వృద్ధులు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు.రోహిణీ కార్తె ప్రభావంతో ఎండల తీవ్రత పెరుగుతోంది. సోమవారం గుంటూరు జిల్లాలో 17, పల్నాడు జిల్లాలో 12 మండలాల్లో వేడిగాలులు వీస్తాయని ఉష్ణోగ్రత 40 నుంచి 42 డిగ్రీల వరకు నమోదు అవుతుందని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ అంచనా వేసింది. రోహిణీకార్తె ప్రభావంతో వేసవి తీవ్రత పెరగనుందని అంచనా వేస్తున్నారు. తుపాను ప్రభావంతో జిల్లాలో వేసవి తీవ్రత తగ్గి వాతావరణం చల్లబడుతుందని ఆశించిన వారికి నిరాశ ఎదురయింది. తుపాను ప్రభావం తరువాత వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ ముందే అంచనా వేసింది. అంతేగాక వేడిగాలులు పెరుగుతున్నందు వల్ల షుగర్‌,బిపి,గురడెనొప్పి వ్యాధిగ్రస్తులు ఎండలో తిరగవద్దని వాతావరణ శాఖ సూచించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఎండల తీవ్రత కొంత ఉన్నా వడగాలి తక్కువగాఉందని సోమవారం నుంచి వచ్చేనెల 5 వరకు వడగాల్పులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నైరుతీ రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే వరకు ఎండల తీవ్రత కొనసాగుతుంది. మరో వైపు వేసవి తీవ్రత వల్ల ఇప్పటికే జిల్లాలోని చాలా ప్రాంతాలలో నీటి ఎద్దడి పెరిగింది. ఈఏడాది ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం తరుఫున తాగునీటి ఎద్దడి, పశు గ్రాసం కొరత, రానున్న ఖరీఫ్‌కు సన్నద్ధతపై ఇంత వరకు ఉన్నత స్థాయిలో సమీక్ష జరగలేదు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి పెరుగుతున్నా జలాశయాల్లో నీరు లేకపోవడంతో ఇప్పట్లో కాల్వలకు నీరు విడుదల చేసే అవకాశం లేకపోవడంతో ఈఏడాది ఖరీఫ్‌ కూడా ఆలస్యం అవుతుందని భావిస్తున్నారు. గత ఏడాది వర్షాభావం వల్ల ఏర్పడిన నీటి ఎద్దడి ఇప్పటికి కొనసాగుతోంది. నాగార్జునసాగర్‌ జలాశయం డెడ్‌ స్టోరేజీ స్థాయికి నీటి మట్టం పడిపోగా పులిచింతలలో అర టిఎంసి మాత్రమే నీటి నిల్వ ఉండటంతో ఇప్పట్లో తాగునీటి అవసరాలకు కూడా నీటి విడుదల చేసే అవకాశం లేదు. ప్రస్తుతం మనుషులతోపాటు పశువు పోషకులు కూడా నీటి ఎద్దడితో అల్లాడుతున్నారు. పశువులకు నీటి సరఫరా పెనుభారంగా మారింది. గత ఆరేడునెలలుగా వర్షాలులేక పచ్చగడ్డి కొరత కూడా పెరిగింది. ప్రస్తుతం ఎండుగడ్డిమాత్రమే దొరుకుతోంది. వేసవి కష్టాలు మరో 40 రోజుల పాటు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. వర్షాలు విస్తారంగా కురిస్తే తప్ప ఇప్పటి కిప్పుడు నీటి ఎద్దడి తొలగిపోయే పరిస్థితి లేదు.

➡️