వేగంగా వెయ్యిపరుగులతో సచిన్‌ రికార్డు బ్రేక్‌

May 10,2024 23:49 #Sports

ఐపిఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న యువ బ్యాట్స్‌ మన్‌ సాయి సుదర్శన్‌ క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ల పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన భారత ఆటగాడిగా సాయి సుదర్శన్‌ చరిత్ర తిరగరాశాడు. భారత ఆటగాళ్లు ఐపీఎల్‌లో వేగంగా 1000 పరుగులు చేసిన ఘనత ఇప్పటివరకు సచిన్‌(ముంబయి ఇండియన్స్‌), చెన్నై కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ల పేరిట ఉంది. శుక్రవారం చెన్నై సూపర్‌ కింగ్స్‌పై సాయి సుదర్శన్‌ (103) సెంచరీతో అదరగొట్టాడు. ఈ క్రమంలోనే అరుదైన ఘనతను అందుకున్నాడు. సచిన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ 31ఇన్నింగ్స్‌లలో 1000 పరుగుల మార్కును చేరుకోగా, సాయి సుదర్శన్‌ కేవలం 25 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత చేరుకోవడం విశేషం. అయితే విదేశీ ఆటగాళ్లతో కూడా కలుపుకుంటే… ఐపీఎల్‌ లో అత్యంత వేగవంతంగా 1000 పరుగులు చేసిన వారి జాబితాలో 22ఏళ్ల సాయి సుదర్శన్‌ మూడో స్థానంలో నిలిచాడు. అతడి కంటే ముందు ఆసీస్‌ ఆటగాడు షాన్‌ మార్ష్‌ (21ఇన్నింగ్స్‌), లెండిల్‌ సిమ్మన్స్‌ (23) ఉన్నారు. ఆసీస్‌ ఆటగాడు మాథ్యూ హేడెన్‌ కూడా ఐపీఎల్‌లో 25 ఇన్నింగ్స్‌లలో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

➡️