పారా ఛాంపియన్‌షిప్‌లో భారత్ ప్రపంచ రికార్డు

కోబ్(జపాన్):  ప్రపంచ పారా ఛాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల టీ20 రేసులో దీప్తి జీవన్‌జీ ప్రపంచ రికార్డుతో స్వర్ణం గెలుచుకుంది. సోమవారం జపాన్ లోని కోబ్ లో  జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 400 మీటర్ల టీ20 కేటగిరీ రేసులో భారత్‌కు చెందిన దీప్తి జీవన్‌జీ 55.07 సెకన్లలో ప్రపంచ రికార్డుతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
గత ఏడాది పారిస్‌లో జరిగిన ఛాంపియన్‌షిప్స్‌లో అమెరికాకు చెందిన బ్రెన్నా క్లార్క్ నెలకొల్పిన 55.12 సెకన్ల ప్రపంచ రికార్డును దీప్తి బద్దలు కొట్టింది.
నాలుగో రోజు పోటీల్లో టర్కీకి చెందిన ఐసెల్ ఒండర్ 55.19 సెకన్లతో రెండో స్థానంలో ఉండగా, ఈక్వెడార్‌కు చెందిన లిజాన్‌షెలా అంగులో 56.68 సెకన్లతో మూడో స్థానంలో నిలిచారు. ఆదివారం జరిగిన హీట్ రేస్‌లో దీప్తి 56.18 సెకన్ల ఆసియా రికార్డు సమయంలో గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. T20 కేటగిరీ అనేది మేధోపరమైన బలహీనత ఉన్న అథ్లెట్ల కోసం ఉద్దేశించబడింది.

పురుషుల ఎఫ్56 విభాగంలో డిస్కస్ త్రోలో యోగేష్ కథునియా 41.80 మీటర్లు ఎగసి రజతం సాధించాడు. F56 వర్గం అనేది ఫీల్డ్ ఈవెంట్‌లలో కూర్చున్న స్థానం నుండి పోటీ చేసే అథ్లెట్ల కోసం ఉద్దేశించబడింది.

భారత్ ఖాతాలో ప్రస్తుతం 1 స్వర్ణం, 1 రజతం, 2 కాంస్యాలతో నాలుగు పతకాలు సాధించింది. ఆదివారం నిషాద్ కుమార్ (టీ47 హైజంప్), 200మీ రన్నర్ ప్రీతి పాల్ (టీ35 200మీ రేసు) వరుసగా రజతం, కాంస్యం సాధించారు. ఛాంపియన్‌షిప్‌లు మే 25 వరకు కొనసాగుతాయి.

➡️