ఫైనల్‌కు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

May 25,2024 08:16 #Cricket, #ipl 2024, #Sports, #SRH
  • క్వాలిఫయర్‌-2లో రాజస్థాన్‌పై 36పరుగుల తేడాతో గెలుపు

చెన్నై: ఐపిఎల్‌ సీజన్‌-17 ఫైనల్లోకి ఆరేళ్ల తర్వాత సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు దూసుకెళ్లింది. చిదంబరం స్టేడి యం వేదికగా శుక్రవారం జరిగిన క్వాలిఫయర్‌- 2లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌జట్టు రాజస్థాన్‌ రాయల్స్‌పై 36పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 175పరుగులు చేసింది. ఛేదనలో భాగంగా ఓపెనర్‌ జైస్వాల్‌(42) రాణించినా.. టామ్‌ కోహ్లెర్‌(10), కెప్టెన్‌ సంజు(10), రియాన్‌ పరాగ్‌(6) నిరాశపరిచారు. ఆ తర్వాత జురెల్‌ అర్ధసెంచరీతో మెరిసినా.. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్స్‌ ఘోరంగా విఫలమయ్యారు. దీంతో రాజస్తాన్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 7వికెట్ల నష్టానికి 139పరుగులే చేసి ఓటమిపాలైంది. తొలుత సన్‌రైజర్స్‌ బ్యాటర్లు హెన్రిక్‌ క్లాసెన్‌ అర్ధసెంచరీకి తోడు త్రిపాఠి, హెడ్‌ రాణించారు. దీంతో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 175పరుగులు చేసింది. ఫైనల్‌ బెర్తు ఖాయమయ్యే పోరులో రాజస్థాన్‌ రాయల్స్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌(3/45), ఆవేశ్‌ ఖాన్‌(3/27), సందీప్‌ శర్మ(2/25) బౌలింగ్‌లో చెలరేగారు.
టాస్‌ ఓడిన హైదరాబాద్‌ తొలి ఓవర్లోనే వికెట్‌ కోల్పోయింది. డేంజరస్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ(12)ను బౌల్ట్‌ వెనక్కి పంపాడు. 13పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయిన సన్‌రైజర్స్‌ను రాహుల్‌ త్రిపాఠి(37) ఆదుకున్నాడు. బౌల్ట్‌, అశ్విన్‌ ఓవర్లలో అలవోకగా భారీ షాట్లు ఆడుతూ బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. దాంతో, రాజస్థాన్‌ జట్టు ఒత్తిడిలో పడేశాడు. ఈ క్రమంలో ఐదో ఓవర్లో బౌల్ట్‌ వేసిన స్లో బాల్‌కు త్రిపాఠి స్లిప్‌లో చాహల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన మర్‌క్రమ్‌(1) మరోసారి నిరాశపరిచాడు. అతడూ స్లిప్‌లో చాహల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 57కే మూడు వికెట్లు పడిన దశలో.. ట్రావిస్‌ హెడ్‌(34), హెన్రిచ్‌ క్లాసెన్‌(50)లు జట్టుకు భారీ స్కోర్‌ అందించే బాధ్యత తీసుకున్నారు. నాలుగో వికెట్‌కు వీరు 42 పరుగులు జత చేశారు.
ఈ జోడీని సందీప్‌ శర్మ విడదీసి హైదరాబాద్‌ను కష్టాల్లోకి నెట్టాడు. హెడ్‌ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన నితీశ్‌ కుమార్‌ రెడ్డి(5), అబ్దుల్‌ సమద్‌(0) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన షV్‌ాబాజ్‌ అహ్మద్‌(18) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. క్లాసెన్‌కు సహకారం అందించడంతో 17 ఓవర్లకు జట్టు స్కోర్‌ 150కి చేరింది. ఆఖరి మూడు ఓవర్లలో భారీ షాట్స్‌ ఆడాలనుకున్న దశలో క్లాసెన్‌ ఔటవ్వడం సన్‌రైజర్స్‌ను దెబ్బతీసింది. అవేశ్‌ ఖాన్‌ వేసిన 20వ ఓవర్లో ప్యాట్‌ కమిన్స్‌(5నాటౌట్‌), ఉనాద్కట్‌(5)లు 6 పరుగులే చేశారు. దీంతో హైదరాబాద్‌ 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.
ఆదివారం జరిగే ఫైనల్లో సీజన్‌-17 టైటిల్‌కై కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు తలపడనుంది.

➡️