ముంబయికి ఎదురుదెబ్బ

  • తొలి లీగ్‌ మ్యాచ్‌లకు సూర్యకుమార్‌ దూరం

ముంబయి: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌-17 మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుండగా.. అన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ప్రధానంగా దృష్టి సారించాయి. ఆటగాళ్లు గాయాలబారిన పడకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. నెట్‌ ప్రాక్టీస్‌లో ఓవైపు ఆటగాళ్లు చెమటలు చిందిస్తున్నా.. స్టార్‌ ఆటగాళ్లకు కొద్దిసేపు ప్రాక్టీస్‌కు మాత్రమే నిమగం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఐదుసార్లు ఐపిఎల్‌ టైటిల్‌ను ముద్దాడిన ముంబయి ఇండియన్స్‌ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌, మిస్టర్‌ 360డిగ్రీస్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఫిట్‌నెస్‌ సాధించడంలో విఫలమైనట్లు బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సిఎ) మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. గత డిసెంబర్‌లో దక్షిణాఫ్రికా పర్యటన నుంచి గాయం కారణంగా స్వదేశానికి తిరిగొచ్చి చికిత్స చేయించుకున్న సూర్యకుమార్‌.. ఇంకా ఫిట్‌నెస్‌ సాధించలేదని ఆ ప్రకటనలో తెలిపింది. దీంతో సూర్య ఐపిఎల్‌ తొలి లీగ్‌ రెండు లేదా మూడు వారాలు దూరమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ముంబయి మిడిలార్డర్‌లో కీలక బ్యాటర్‌ అయిన సూర్యకుమార్‌ దూరమైతే ఆ జట్టుకు కష్టాలు తప్పవు.

➡️