Thailand Open: ఫైనల్‌కు సాత్విక్‌-చిరాగ్‌

May 18,2024 22:00 #Badminton, #Sports

బ్యాంకాక్‌: భారత స్టార్‌ డబుల్స్‌ జంట చిరాగ్‌ శెట్టి-సాత్విక్‌ సాయిరాజ్‌ మరో టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచారు. థాయ్ లాండ్‌ ఓపెన్‌ సూపర్‌-500 బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన సెమీఫైనల్లో సాత్విక్‌-చిరాగ్‌ 21-11, 21-12తో చైనీస్‌ తైపీకి చెందిన లూ-మింగ్‌, టాంగ్‌ కురులను ఓడించారు. టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగిన వీరు ప్రారంభం నుంచే ప్రత్యర్థులపై బలమైన ఫోర్‌హ్యాండ్‌ షాట్లతో విరుచుకుపడ్డారు. ఈ మ్యాచ్‌ కేవలం 35నిమిషాల్లోనే ముగిసింది. ఇక రెండో గేమ్‌లో 17-10పాయింట్ల ఆధిక్యతలోకి దూసుకెళ్లారు. ఆ తర్వాత ప్రత్యర్ధి షట్లర్లకు ఏమాత్రం అవకాశమివ్వకుండా మ్యాచ్‌ను ముగించారు. ఆదివారం జరిగే ఫైనల్లో వీరు చైనాకు చెందిన చెన్‌-బో యంగ్‌, లూ యీలతో తలపడనున్నారు. చైనా జంట 21-19, 21-18తో కొరియాకు చెందిన కిమ్‌ జి-కిమ్‌ సాలను ఓడించారు.

➡️