టూరిజం హబ్‌గా కడియం

Jun 26,2024 21:35 #Kadiam, #tourism hub

హార్టికల్చర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు : మంత్రి కందుల దుర్గేష్‌
ప్రజాశక్తి- కడియం :నర్సరీ రైతుల కోసం ప్రభుత్వం హార్టికల్చర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాన్ని కడియం ప్రాంతంలో ఏర్పాటు చేస్తామని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ తెలిపారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొదటి సారిగా ఆయన కడియపులంకలో కార్యకర్తలతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర, దేశం నుంచే కాక ప్రపంచ దేశాల పర్యాటకులను ఆకర్షించే అద్భుతమైన నర్సరీల అందాలు కడియం ప్రాంతంలో మెండుగా ఉన్నాయన్నారు. వాటికి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే వ్యాపారపరంగా మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. నర్సరీల నుంచి దేశ విదేశాలకు కనువిందైన మొక్కలను ఎగుమతి చేస్తున్నారని వివరించారు. ఈ ప్రాంత రైతులు స్వదేశ విజ్ఞానాన్ని ఉపయోగించుకుని అనేక కొత్త రకాల వంగడాలను ఉత్పత్తి చేయడం చాలా ఆనందదాయకమని అభినందనీయమన్నారు. ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. గోదావరి అందాలు, రాజమహేంద్రవరం హేవలాక్‌ బ్రిడ్జి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని తెలిపారు. పిచ్చుక లంక ప్రాంతం అభివృద్ధికి ఓబరారు సంస్థతో సంప్రదింపులు జరుపుతామన్నారు. ఎకో టూరిజం, టెంపుల్‌ టూరిజం, హెరిటేజ్‌ టూరిజం, రివర్‌ టూరిజం వంటి వాటిని అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వం వీటికి కేటాయించిన నిధులను పక్కదోవ పట్టించిందన్నారు.

➡️