బ్యాటర్లపైనే భారం..

Jan 3,2024 11:21 #Cricket, #Sports, #Test Cricket
  • రేపటి నుంచి దక్షిణాఫ్రికాతో చివరి టెస్ట్‌మ.2.00గం||ల నుంచి

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో గెలిచి, సిరీస్‌ను డ్రా చేయాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. వన్డే, టి20 సిరీస్‌లను నెగ్గిన టీమిండియా రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో 0-1తో వెనుకబడి ఉంది. టెస్ట్‌ సిరీస్‌ చేజార్చుకోకుండా ఉండాలంటే నేటినుంచి దక్షిణాఫ్రికాతో జరిగే రెండో, చివరి టెస్ట్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. దీంతో సోమవారం కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌ నెట్‌ ప్రాక్టీస్‌లో చెమటోడ్చారు. తొలి టెస్టు అరంగేట్రంలో ఏడు వికెట్లతో సత్తాచాటిన సఫారీ ఎడమ చేతి వాటం పేసర్‌ బర్గర్‌కు కళ్లెం వేయడంపై కోహ్లి దృష్టి సారించాడు. అందుకే ఓ నెట్‌ బౌలర్‌ బౌలింగ్‌లో ప్రత్యేకంగా సాధన చేశాడు. భారత దృందంలో ఎడమ చేతి వాటం పేసర్‌ లేకపోవడంతో అక్కడి నెట్‌ బౌలర్‌తో కోహ్లి బంతులు వేయించుకున్నాడు. అయితే బర్గర్‌ వేసే దాని కంటే తక్కువ వేగంతో వచ్చిన ఈ బంతులను కోహ్లి బాగానే ఎదుర్కొన్నాడు. కానీ మ్యాచ్‌ పరిస్థితుల్లో బర్గర్‌ను ఎలా నిలువరిస్తాడో చూడాలి. బుమ్రా, సిరాజ్‌, అశ్విన్‌, అవేశ్‌ బౌలింగ్‌లోనూ కోహ్లి బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. మరోవైపు షార్ట్‌ పిచ్‌ బంతులకు ఔటయ్యే బలహీనతను అధిగమించేందుకు శ్రేయస్‌ కసరత్తులు చేస్తున్నాడు. త్రోడౌన్‌ సిబ్బందితో బౌన్సర్లు వచ్చేలా 18 గజాల దూరం నుంచే బంతిని త్రో చేయించుకుని బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. శనివారం బ్యాటింగ్‌ చేస్తూ గాయపడ్డ శార్దూల్‌ కోలుకున్నాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ 32పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

జట్లు(అంచనా)..

భారత్‌: రోహిత్‌(కెప్టెన్‌), జైస్వాల్‌, శుభ్‌మన్‌, కోహ్లి, శ్రేయస్‌, కెఎల్‌ రాహుల్‌(వికెట్‌ కీపర్‌), శార్దూల్‌/జడేజా, బుమ్రా, సిరాజ్‌, ఆవేశ్‌ఖాన్‌, ప్రసిధ్‌ కృష్ణ. దక్షిణాఫ్రికా: ఎల్గర్‌(కెప్టెన్‌), మార్‌క్రమ్‌, జోర్జి, పేటర్సన్‌, బడింగ్హామ్‌, వెర్రెయనె, జెన్సన్‌, మహరాజ్‌, రబడా, బర్గర్‌, ఎన్గిడి.

➡️