ముంబై vs ఢిల్లీ.. గెలిచేదెవరో..?

Apr 7,2024 11:48 #2024 ipl, #Cricket, #mi vs dc, #Sports
ఐపీఎల్‌-2024లో హ్యాట్రిక్‌ పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న జట్టు ముంబై..  ఈ నేపథ్యంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి తొలి విజయం అందుకోవాలని పట్టుదలగా ఉంది. సొంత మైదానం వాంఖడేలోనైనా సత్తా చాటాలని ఉవ్విళూర్లుతోంది. స్టార్లకు కొదవలేని టీమ్ లో తిలక్ మాత్రమే కాస్త నిలకడగా రాణిస్తున్నాడు.  రోహిత్, ఇషాన్ జట్టుకు ఆరంభాన్ని అందించడంలో విఫలమవుతున్నారు. నమన్ ధిర్, డెవాల్డ్ బ్రెవిస్ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉండగా.. హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్  ఆశించినంత రాణించలేక పోతున్నారు.  గత మ్యాచ్‌ల్లో మిడిలార్డర్‌లో సూర్యకుమార్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. అతను తిరిగి రావడం ఆ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపేదే. అయితే, ఢిల్లీతో మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉంటాడా?లేదా? అన్నది తెలియాల్సి ఉంది.
మరోవైపు.. ఢిల్లీ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో ఓడిపోయింది. ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. పంత్‌ సేనకు ముంబైతో పోరు కీలకంగా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ లో పంత్, వార్నర్, ట్రిస్టన్ స్టబ్స్ కూడా మంచి టచ్​లో ఉండటం కలిసొచ్చే అంశం. డేవిడ్ వార్నర్​కు తోడు మరో ఓపెనర్ పృథ్వీ షా రిథమ్​లోకి వస్తే ఆ టీమ్​కు తిరుగుండదు. గాయంతో ఇబ్బంది పడుతున్న కుల్దీప్ యాదవ్ అందుబాటులో లేకపోవడంతో ఆ జట్టు సమస్యలు మరింత పెరిగాయి.
జట్లు (అంచనా)
ముంబై: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, గెరాల్డ్ కొయెట్జీ, పీయుష్ చావ్లా, ఆకాశ్ మధ్వాల్, జస్​ప్రీత్ బుమ్రా, క్వెనా మఫాకా.
ఢిల్లీ: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్ & వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, రసిఖ్ దార్ సలామ్, అన్రిచ్ నోకియా, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.
➡️