అంగన్వాడీల వంటావార్పు

కనీస వేతనం రూ.26 వేలు, గ్రాట్యుటీ అమలు తదితర

పొందూరు : వంటావార్పులో పాల్గొన్న అంగన్వాడీ, సిఐటియు నాయకులు

  • ఎచ్చెర్ల కూడలి వద్ద మానవహారం
  • వంటావర్పునకు హాజరైన మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి

ప్రజాశక్తి – విలేకరుల యంత్రాంగం

కనీస వేతనం రూ.26 వేలు, గ్రాట్యుటీ అమలు తదితర సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారానికి ఎనిమిదో రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా వంటావార్పు, మానవహారాలు చేపట్టి నిరసన తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని ఐసిడిఎస్‌ అర్బన్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీలు వంటావార్పు చేపట్టారు. టిడిపి మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అంగన్వాడీలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై అనుసరిస్తున్న మొండివైఖరి విడనాడాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీల వేతనాల పెంపుతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎ.మహాలక్ష్మి, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు కె.కళ్యాణి, టిడిపి నగర అధ్యక్షులు ఎం.వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.ఎచ్చెర్లలో అంగన్వాడీలు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు మాట్లాడుతూ అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు వై.విజయలక్ష్మి, శారద, సరస్వతి, లలిత తదితరులు పాల్గొన్నారు.పొందూరులో అంగన్వాడీలు వంటావార్పు చేపట్టి నిరసన తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు కూన వెంకటరావు సమ్మె శిబిరాన్ని సందర్శించి అంగన్వాడీల పోరాటానికి సంఘీభావం తెలిపి రూ.వెయ్యి విరాళం ఇచ్చారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు బి.జ్యోతిలక్ష్మి, జి.నాగరత్నం, ఎస్‌.రమణమ్మ, కె.కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.బూర్జలో ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీలు వంటావార్పు చేపట్టి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి ఎ.సత్యనారాయణ, అంగన్వాడీ ప్రాజెక్ట్‌ అధ్యక్ష, కార్యదర్శులు జ్యోతి, రాధిక తదితరులు పాల్గొన్నారు.టెక్కలి తహశీల్దార్‌ కార్యాలయం వద్ద వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు నంబూరు షణ్ముఖరావు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు ఆర్‌.ఆదిలక్ష్మి, సిహెచ్‌.ఇందుమతి, వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు.పలాసలో కాశీబుగ్గ ఐసిడిఎస్‌ ప్రాజెక్టు వద్ద అంగన్వాడీలు చేపడుతున్న సమ్మెకు ఐద్వా నాయకులు ఢిల్లేశ్వరి, భాగ్యలక్ష్మి, విశ్రాంత ఆదాయ పన్ను శాఖ డిప్యూటీ కమిషనర్‌ జుత్తు తాతారావు, యువసేన సభ్యులు కుత్తుం వినోద్‌, అగ్నికుల క్షత్రియ యూత్‌ ఫోర్స్‌ నియోజకవర్గ అధ్యక్షులు కె.శ్యామ్‌, మందస యూత్‌ ఫోర్స్‌ అధ్యక్షులు మురళి తదితరులు సంఘీభావం తెలిపారు.ఆమదాలవలసలో అంగన్వాడీలు సమస్యల పరిష్కారం కోరుతూ తహశీల్దార్‌ గణపతిరావుకు వినతిపత్రం ఇచ్చారు. అంగన్వాడీల సమ్మెకు పిసిసి ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించుకుంటే, వారితో కలిసి కాంగ్రెస్‌ పార్టీ పోరాటానికి సిద్ధమవుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సనపల అన్నాజీరావు, బొడ్డేపల్లి గోవింద గోపాల్‌, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగమణి, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు పంచాది లతాదేవి, భూలక్ష్మి, ఎం.లత తదితరులు పాల్గొన్నారు.కోటబొమ్మాళి ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన నిరసన దీక్షలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు డి.సుధ తదితరులు పాల్గొన్నారు. తాళాలు పగులగొట్టిన అధికారులు పలాస మండలంలోని లొద్దభద్ర, తర్లాకోట, అల్లుకోల, రెంటికోటలో అంగన్వాడీ కేంద్రాల తాళాలను ఎంపిడిఒ ఎన్‌.రమేష్‌ నాయుడు, పంచాయతీ విస్తరణాధికారి మెట్ట వైకుంఠరావు సమక్షంలో బద్దలు కొట్టారు. ఈ కేంద్రాల్లోని పౌష్టికాహారం, ఇతర సరుకులను విఆర్‌ఒల సమక్షంలో నమోదు చేసి సచివాలయ ఉద్యోగులకు కేంద్రాల బాధ్యతను అప్పగించారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ మాట్లాడుతూ కేంద్రాల్లో రికార్డులు లేకపోవడంతో గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ చేయలేకపోయామని, ఐసిడిఎస్‌ అధికారుల సమక్షంలో పంపిణీ చేస్తామని చెప్పారు.ఐసిడిఎస్‌ వాహనం అడ్డగింతఇచ్ఛాపురం మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాలకు తరలించేందుకు సరుకులతో వచ్చిన వాహనాన్ని అంగన్వాడీలు బెల్లుపడ వద్ద అడ్డుకున్నారు. ఐసిడిఎస్‌ అధికారి నాగరాణి, రెవెన్యూ, సచివాలయం, పోలీస్‌ సిబ్బందితో వాహనాన్ని తరలించే ప్రయత్నం చేయగా… అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డుకి అడ్డంగా నిల్చొని అధికారులతో వాగ్వివాదానికి దిగారు. చివరకు పోలీసులు అంగన్వాడీలను పక్కకునెట్టి వాహనాన్ని ముందుకు తరలించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి లకీëనారాయణ, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు హైమావతి, బాలమణి, విజయలక్ష్మి, జయ, ఉమ తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️