కులగణన సర్వే ప్రక్రియ పరిశీలన

కులగణన సర్వే ప్రక్రియ పరిశీలన

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌ స్థానిక 10వ వార్డులో కులగణన నమోదు ప్రక్రియను కలెక్టర్‌ శుక్రవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాధవీలత క్షేత్ర స్థాయిలో కులగణన చేపడుతున్న సిబ్బంది పనితీరును పరిశీలించారు. డేటా ఎంట్రీ సమయంలో తీసుకుంటున్న చర్యలు పై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో జనవరి 19 నుంచి 28 వరకు 10 రోజుల పాటు కులగణన సర్వే క్షేత్ర స్థాయిలో పూర్తి చెయ్యాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లావ్యాప్తంగా 512 సచివాలయాల్లో 8,960 క్లస్టర్లలో 6,04,059 కుటుంబాల కులగణన చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సర్వే ప్రక్రియలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది 8,781 మంది ఇంటింటి సందర్శన చేసి కులగణన పూర్తి చేస్తారని తెలిపారు. జనవరి 19 నుంచి 28 వరకు ఇంటింటి సర్వే పూర్తి చేసి, జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు 5 రోజుల పాటు ఆయా సచివాలయాల్లో నమోదు చేసిన డేటా అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ప్రజలు నేరుగా వెళ్లి అందుబాటులో ఉన్న డేటా వివరాలు తెలుసుకునే సౌలభ్యం కల్పించనున్నట్టు మాధవీలత పేర్కొన్నారు. డేటా ధ్రువీకరణ, డేటా ఖరారు చేసి నిర్ధారణ ప్రక్రియ ఫిబ్రవరి 15 వరకు నిర్వహిస్తారన్నారు. బయో మెట్రిక్‌ ఆధారిత నిర్ధారణ చేపట్టి ఎటువంటి లోపాలు లేకుండా సమర్థవంతంగా కులగణన పూర్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బందికి ఎదురయ్యే సమస్యలు, సందేహాలను తీర్చేలా ఎంపిడిఒలు సర్వేపై పూర్తి అవగాహనతో ఉండాలన్నారు. మండల స్థాయి, మున్సిపల్‌ స్థాయి అధికారులంతా వారికి కేటాయించిన గ్రామాలను, వార్డులను ప్రతి రోజు సందర్శించాలని, సూపర్‌వైజర్లు కూడా ప్రతి రోజు ఫీల్డ్‌లో ఉండాలని ఆదేశించారు.

➡️