తుఫాన్‌ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

తుఫాన్‌ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

  ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తున్న పరిటాల సునీత

               కనగానపల్లి : తుఫాన్‌ ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫల మైందని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆమె రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లిలో ఇంటింటికీ వెళ్లి మినీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. అందులోని మహిళా సంక్షేమ పథకాలు, రైతులు, నిరుద్యోగులకు లబ్ధి చేకూర్చే అంశాల గురించి అవగాహన కల్పిస్తూ ముందుకుసాగారు. సునీత మాట్లాడుతూ కోస్తా, నెల్లూరు, తిరుపతి జిల్లాలతో పాటు శ్రీసత్యసాయి జిల్లాలో తుఫాన్‌ ప్రభావంతో పెద్దఎత్తున పంట నష్టం జరిగిందన్నారు. కోస్తా ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుండగా వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు బస్సు యాత్రల పేరుతో షోలు చేస్తున్నారని విమర్శించారు. ఆ యాత్రలో కూడా ప్రతిపక్షాలను, చంద్రబాబుని తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. వైసిపి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే రైతులకు అండగా నిలబడాలని హితవు పలికారు.

తాడేపల్లి ప్యాలెస్‌ వదిలి బయటకురండి

         పెనుకొండ : రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్‌ ప్రభావంతో లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగి రైతులు ఆందోళనలతో ఉన్నా సిఎం జగన్‌ రెడ్డి తాడేపల్లిలోని ప్యాలెస్‌ వదిలి బయటకు రావడం లేదని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ విమర్శించారు. పట్టణంలోని తన కార్యాలయంలో గురువారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం బాధిత ప్రాంతాల్లో ప్రజలకు ఆహారం, నిత్యావసర వస్తువులు సరఫరా చేయలేక, పునరావాసం కల్పించలేక చేతులెత్తేసిందని ధ్వజమెత్తారు. సిఎం జగన్‌ తూతూ మంత్రంగా సమీక్ష చేసి చేతులు దులుపుకున్నారన్నారు. ఇకనైనా తుఫాన్‌ ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకోవడంతో పాటు బాధితులకు అండగా నిలవాలని, తడిచిన, రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ డిమాండ్‌ చేశారు. సమావేశంలో నాయకులు మాధవనాయుడు, వెంకటరామిరెడ్డి, ఎస్‌ఎన్‌.గోవిందరెడ్డి, శ్రీరాములు, ప్రసాద్‌, మైలాలప్ప, త్రివేంద్రనాయుడు, మారుతిప్రసాద్‌, బాబుల్‌రెడ్డి, కోనాపురం సుబ్బు, చౌడప్ప, బాబు, మంజు, తదితరులు పాల్గొన్నారు.

➡️