త్రిశంకుస్వర్గంలో సర్పంచ్‌లు

మండలంలోని అయోధ్యపురం,

లింగాలవలసలో నిర్మించిన ఆర్‌బికె, వెల్‌నెస్‌ భవనాలు

ప్రజాశక్తి- టెక్కలి

మండలంలోని అయోధ్యపురం, నర్సింగపల్లి, పాతనౌపడ, పి.ఆర్‌.పల్లి, బొప్పాయిపురం, పరశురాంపురం, ముఖలింగాపురం పంచాయతీల సర్పంచ్‌ల భవితవ్యం త్రిశంకుస్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. పంచాయతీల పరిధిలో సర్పంచ్‌లుగా ఎన్నికైన తరువాత పలు అభివృద్ధి పనులు చేపట్టారు. వీటికి సంబంధించిన బిల్లులు మంజురు కాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిషత్‌ ద్వారా మంజురైన నిధుల నుంచి కాలువలు, చిన్నపాటి రోడ్లు నిర్మాణాలు చేపట్టారు. ఇందుకు సంబంధించి బిల్లులు పెట్టారు. అయితే ఏడాది కాలం నుంచి బిల్లులు మంజూరు కావడం లేదు. చేసిన పనులకు సంబంధించి బిల్లులు వస్తాయా? రావా? ఆనే మీమాంశలో ఉన్నారు. ఇదిలాఉండగా కొందరు సర్పంచ్‌లు రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్‌ కేంద్రాలు నిర్మాణం చేపట్టారు. వాటికి సంబంధించిన బిల్లులూ మంజురు కాని పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న అధికారులు త్వరలో జరగనున్న ఎన్నికల దృష్ట్యా బదిలీలు అవుతున్నారు. దీంతో బిల్లులు మంజూరుకు ఆంక్షలు వర్తిస్తాయి. ఈ క్రమంలో తాము పెట్టిన పెట్టుబడులు వస్తాయో? రావో? తెలియని పరిస్దితి నెలకుంది. కాగా, భవిష్యత్‌ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారం చేపడుతుందో తెలియని పరిస్థితి ఉండడంతో సర్పంచ్‌లకు ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే లక్షలాది రూపాయలు తమ చేతి సొమ్ములు చెల్లించి పెట్టుబడులు పెట్టామని, కానీ, ఇప్పటి వరకు పైసా మంజూరు కాకపోవడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు ఇక్కడి వైసిపి నేతల్లో ఐక్యతారాగం లేకపోవడం వల్ల వర్గాలుగా ముద్రపడిన కొందరు సర్పంచ్‌లు లక్ష్యం కావడంతో తమ బిల్లులు మంజురు పరిస్థితి ఏమిటనే వాదనను వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా వైసిపి అధికారంలో ఉండి కూడా తమ బిల్లులు మంజూరు కాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్న సర్పంచ్‌లకు ఎన్నికలు గుదిబండగా మారనున్నాయి. పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు విడుదల అవుతున్నా… అవి కేవలం పంచాయతీ పారిశుధ్య కార్మికుల జీతాలకు, పంచాయతీ అవసరాలకే సరిపోతుండడంతో తాము చేసిన పనులకు బిల్లులు మంజురవుతాయో? లేదో? తెలియని పరిస్థితుల్లో సర్పంచ్‌లు మదనపడుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఎన్నికల కోడ్‌ అమలు కాకముందే ముందే ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

 

 

➡️