నిరంకుశ వైసీపీకి పరాజయం తప్పదు

ప్రజాశక్తి-కనిగిరి: ప్రజా సమస్యలు పట్టించు కోకుండా నిరంకుశ పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి పరాజ యం తప్పదని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జివి కొండారెడ్డి అన్నారు. కనిగిరి పట్టణం లోని సుందరయ్య భవనం లో ఆదివారం పీసీ కేశవరావు అధ్యక్షతన సిపిఎం పట్టణ కమిటీ సమావేశం జరిగింది. సమావేశాన్ని ఉద్దేశించి జివి కొండారెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీలు తమ న్యాయమైన కోర్కెలను తీర్చాలని శాంతియుతంగా సమ్మె చేస్తుంటే పరిష్కరించకుండా అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి స్టాక్‌ స్వాధీనం చేసుకోవడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్‌ లేక నిరుద్యోగులు, విపత్కర పరిస్థితుల కారణంగా పంటలు దెబ్బతిన్న, పండిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతాంగం ఇబ్బంది పడుతున్నా, ధరల భారంతో ప్రజలు అల్లాడుతున్నా ఈ ప్రభుత్వానికి పట్టకపోవడం దారుణమని అన్నారు. కార్మిక వ్యతిరేక చట్టాలను అమలు చేస్తూ నియంతృత్వ పాలనను సాగిస్తూ హక్కులను కాలరాస్తోందని అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. లేకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు పిల్లి తిప్పారెడ్డి, బడుగు వెంకటేశ్వర్లు, ఎస్‌కే బషీరా, కొండలరావు, ఆర్‌ ఏడుకొండలు, ఎం కొండారెడ్డి, శాంతకుమారి, యు పిచ్చయ్య, కృష్ణమూర్తి, నరేంద్ర, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

➡️