విఒఎలకు కనీస వేతనం ఇవ్వాలి

Jan 29,2024 01:13

ప్రజాశక్తి-వెలిగండ్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదివారం వెలిగండ్లలో మండల వెలుగు యానిమేటర్స్‌ సమావేశం టి స్వప్న అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు రాయల మాలకొండయ్య పాల్గొని మాట్లాడుతూ విఓఏలు గత కొన్ని సంవత్సరాల నుంచి గ్రామాల్లో డ్వాక్రా గ్రూపు సభ్యులకు, ప్రభుత్వానికి మధ్యవర్తులుగా ఉంటూ తక్కువ వేతనంతో కాలం గడుపుతున్నారని, ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే వారిని తొలగించి కొత్తవారిని నియమిస్తున్నారని, ఇలాంటి అలవాట్లు మానుకోవాలని కోరారు. వేతనం రూ.10 వేలు అని చెప్పి రూ.8 వేలు ఇస్తున్నారని, మిగతా రూ.2 వేలు డ్వాక్రా సంఘాల గ్రూపు మీటింగుల్లో వసూలు చేసు కోవాలని వారి మీద రుద్దుతున్నారని అన్నారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. వయసు పైబడిన వారికి, అనారోగ్యంతో ఉన్నవారికి, వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని, జెండరు, వయస్సు, చదువు పేరుతో తొలగింపులు ఆపాలని, 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్‌ రద్దు చేయాలని, హెచ్‌ఆర్‌పి పాలసీ అమలు చేయాలని, రూ.10 లక్షల గ్రూపు ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని, విఒఎల మెర్జ్‌ ఆపాలని, అన్ని రకాల బకాయిలు చెల్లించాలని, కోరారు. ఈ కార్యక్రమంలో మాచర్ల నాగలక్ష్మి, కేలం సుభాషిణి, కాకర్ల జయమ్మ, ఉండేల విజయ, విజరు తదితరులు పాల్గొన్నారు.

➡️