షాపును కూల్చడం అన్యాయం

ఘటనా స్థలంతో మాట్లాడుతున్న సురేంద్ర

ప్రజాశక్తి-అరకులోయ రూరల్‌:ఆదివాసుల టిఫిన్‌ షాపు గుడిసెను తొలగించడం అన్యాయమని, బాధిత కుటుంబానికి వేరొక చోట స్థలం కేటాయించి జీవనోపాధి కల్పించాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర డిమాండ్‌ చేశారు. అరకువేలిలో శనివారం రెవెన్యు అధికారులు కూల్చిన టిఫిన్‌ షాప్‌ గుడిసెను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అరకువేలి మెయిన్‌ రోడ్‌ పక్కన తహశీల్దార్‌ కార్యాలయం ఎదురుగా బోసుబెడ్డ గ్రామనికి చెందిన గిరిజన కుటుంబం గత 14 ఏళక్లు పైగా చిన్న టిఫిన్‌ దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. టిఫిన్‌ గుడిసెలను రెవిన్యూ సిబ్బంది దౌర్జన్యంగా తొలగించి ఇంటి సామాన్లు కూడా తీయకుండా మొత్తం ధ్వంసం చేయడంతో ఆ కుటుంబం రోడ్డున పడిందని చెప్పారు. 1/70 చట్టాన్ని ఉల్లంఘించి అరకులోయ మండల కేంద్రంలోని గిరిజనేతరులు పెద్ద పెద్ద అంతస్తులు నిర్మించి దర్జాగా వ్యాపారాలు చేసుకుంటున్నా వారిపై చర్యలు తీసుకోని అధికారులు అమాయక గిరిజనుల గుడిసెలు, టిఫిన్‌ షాప్స్‌ను అన్యాయంగా దౌర్జన్యంగా రెవిన్యూ అధికారుల కూల్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రెవిన్యూ అధికారులు గిరిజనేతరులు ఇచ్చే కాసులకు అమ్ముడుపోయి గిరిజన హక్కులు, చట్టాలు కాలరాస్తున్నారని మండిపడ్డారు. రెవిన్యూ సిబ్బంది గిరిజనేతరులు నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై ప్రతాపం చూపించాలని, గిరిజనులపై కాదన్నారు. తక్షణమే బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని, స్థలం కేటాయించి జీవనోపాధి కల్పించాలని డిమాండ్‌ చేశారు.

➡️