స్పీకర్‌కు లేఖ రాసిన ముగ్గురు రెబల్‌ ఎమ్మెల్యేలు

Feb 15,2024 16:46 #speaker to letter

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రెబల్‌ ఎమ్మెల్యేల విచారణ, చర్యలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. తాజాగా మరోసారి స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు లేఖ రాశారు ముగ్గురు వైసిపి రెబల్‌ ఎమ్మెల్యేలు.. చీఫ్‌ విప్‌ ప్రసాద్‌ రాజు తమకు వ్యతిరేకంగా సమర్పించిన ఆధారాలు ఇండియన్‌ ఎవిడెన్స్‌ ఆక్ట్‌ ప్రకారం చెల్లవు అని తమ లేఖలో పేర్కొన్నారు. ప్రసాద్‌ రాజు సమర్పించిన వీడియోలు ఒరిజినల్‌ అని ఆయా సంస్థలు నుండి సర్టిఫై కాపీలను తెప్పించాలని.. ముగ్గురు వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డిలు స్పీకర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.అయితే, ఈ వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలపై లేఖపై స్పందించిన చీఫ్‌ విప్‌ ప్రసాద్‌ రాజు.. రెబల్‌ ఎమ్మెల్యేలు ఉద్దేశ్యపూర్వకంగానే కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఏవో కారణాలు చెబుతూ విచారణకు హాజరు కావడం లేదని దుయ్యబట్టిన ఆయన.. రెబల్‌ ఎమ్మెల్యేలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు బహిరంగంగానే ఉందన్నారు. ఇక మరోసారి రెబల్‌ ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వొద్దు.. వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాంను కోరినట్టు పేర్కొన్నారు. కాగా, ముగ్గురు వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యే లకు నోటీసులు ఇచ్చిన స్పీకర్‌ తమ్మినేని సీతారాం.. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణఖు హాజరు కావాలని ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డికి పంపిన నోటీసుల్లో పేర్కొన్నారు.. రెబల్‌ ఎమ్మెల్యేలు వస్తారన్న ఉద్దేశంతో అసెంబ్లీలోని తన కార్యాలయంలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఎదురుచూడగా.. హాజరు అయ్యేందుకు మరింత సమయం కావాలంటూ ఆ ముగ్గురు వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు లేఖలు రాశారు.

➡️