హైడ్రో పవర్‌ ప్లాంట్‌ పనుల అడ్డగింత

Jan 28,2024 21:41 #Dharna, #girijanulu

ప్రజాశక్తి – దేవరాపల్లి (అనకాపల్లి):అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని చింతలపూడి పంచాయతీ పరిధిలోని బలిపురం నుంచి వీలుపర్తి పంచాయతీ పరిధిలోని మారికకొండ వరకు అదానీ కంపెనీ తలపెట్టిన హైడ్రో పవర్‌ ప్లాంట్‌ నిర్మాణ పనులపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం హైడ్రో ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు వచ్చిన కాంట్రాక్టర్లను అడ్డుకున్నారు. పనులు చేపట్టవద్దనినెల రోజుల క్రితమే తాము తెలియజేసినప్పటికీ యధావిధిగా మళ్లీ పనులు ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. యంత్రాలను వెనక్కి పంపించాలని డిమాండ్‌ చేశారు. మరోసారి ఈ ప్రాంతంలో పనులు చేపడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గిరిజనుల ఆందోళనకు సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.వెంకన్న, మండల కార్యదర్శి బిటి.దొర మద్దతు తెలిపి మాట్లాడారు. హైడ్రో పవర్‌ ప్లాంట్‌ పనుల కోసం అదానీ కంపెనీకి చెందిన కొంతమంది యంత్రాల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా సాయిల్‌ పరీక్షలు చేస్తున్నారన్నారు. గతంలో రైవాడ ప్రాజెక్టుపై హైడ్రో పవర్‌ ప్లాంట్‌ చేపడుతున్నట్టు, దీనికి క్యాబినెట్‌ ఆమోదం తెలిపినట్టు వచ్చిన వార్తలు ఇప్పుడు నిజమవుతున్నాయని తెలిపారు. తాజా ప్రాజెక్టు నిర్మాణంతో చింతలపూడి పంచాయతీలోని 9 గ్రామాలు, తామారబ్బ పంచాయతీలోని 7 గ్రామాలు, రైవాడ ఆయకట్టు రైతులకు చెందిన సుమారు 20 వేల ఎకరాలకు నష్టం వాటిల్లుతుందన్నారు. సాగు, తాగునీటికి ఇబ్బంది ఎదురుకానుందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు తక్షణం జోక్యం చేసుకొని పనులను శాశ్వతంగా నిలుపుదల చేయించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో స్థానికులు జగన్నాథం, గంగులు, దాయిరి శ్రీను, గమ్మెల లక్ష్మణ, వీరన్న దొర పాల్గొన్నారు.

➡️